డిమాండ్ బ్యాడ్జీలతో కంటి వెలుగు డ్యూటీలు

డిమాండ్ బ్యాడ్జీలతో కంటి వెలుగు డ్యూటీలు

డిమాండ్ బ్యాడ్జీలు ధరించి కంటి వెలుగు డ్యూటీలకు హాజరుకావాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ యూనియన్ అధ్యక్షులు ఎండీ ఫసియుద్దీన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 18 నుంచి 21వ తేదీ వరకు సిబ్బంది డిమాండ్ బ్యాడ్జీలు ధరించాలని పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను ఇప్పటికీ రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో 36రకాల రికార్డును నమోదుచేస్తున్న ఏఎన్ఎంల పట్ల వివక్ష చూపడం సరికాదని అన్నారు. 

తెలంగాణలో తొలి పీఆర్సీ బేసిక్ పే ఇవ్వకుండా 30% వేతనాలు పెంచడం వలన  ఏఎన్ఎంలు ప్రతినెలా రూ.5 వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బేసిక్ పే ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 23 ఏండ్లుగా పనిచేస్తున్న వారికి సైతం కనీస వేతనాలు ఇవ్వకుండా, రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే వీరందరిని ఎలాంటి షరతులు లేకుండ యథావిధిగా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్పందన ఆధారంగా జనవరి 22న భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.