ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘ఉపాధి హామీ’ నిర్లక్ష్యంపై డీఆర్​డీవో శ్రీనివాస్​ఆగ్రహం

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: కౌడిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చనిపోయిన వ్యక్తి పనిచేస్తున్నట్లు అతడి అకౌంట్​లో డబ్బులు జమ కావడంపై డీఆర్ డీవో శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. పథకం అమలులో ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా?  అంటూ ఎంపీడీవో, ఏపీఓల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. మొత్తం రూ.22 కోట్ల 22 లక్షల విలువైన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ  చేశారు. ఈ సందర్బంగా డీ ఆర్ డీ వో మాట్లాడుతూ మండలంలో  28 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రతి ఊరిలో ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ లలో రికార్డులో చూపించిన మొక్కల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. అవకతవకలకు సంబంధించి  బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, నిధులు రికవరీ చేస్తామన్నారు. బూరుగడ్డ గ్రామంలో ఇంకుడు  ఇంకుడు గుంతలు కట్టించినప్పటికీ కొందరికి డబ్బులు రాలేదని, చాలా గ్రామపంచాయతీలో ఉపాధి పనులు చేసిన కూలీల సంతకాలు తీసుకోకుండానే డబ్బులు డ్రా చేసినట్లు తేలిందన్నారు. ఉపాధి హామీలో పనిచేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా వేరేవారికి డబ్బులు ఇచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఆడిట్ లో  డీవీవో శ్రీహరి, ప్లానిటేషన్ మేనేజర్ శశిరేఖ, ఎంపీపీ రాజు నాయక్, ఎంపీడీవో భారతి, ఏపీవో పుణ్యాదాస్, ఎస్ఆర్ పీ ప్రదీప్ కుమార్, కార్యదర్శులు,
 టీఏలు ఉన్నారు.

పీహెచ్​సీల్లో మెరుగైన వైద్యం అందించాలి

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెదక్​ డీ ఎంహెచ్ వో డాక్టర్ విజయ నిర్మల అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట పీ హెచ్ సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పలు రికార్డులు, ప్రసూతి, వ్యాక్సిన్ గదులు, ల్యాబ్, కొత్త భవనాన్ని పరిశీలించారు. పీహెచ్ సీ డాక్టర్ పై ఫిర్యాదులు రావడంతో అతడిని చిన్నశంకరంపేటకు బదిలీ చేశామన్నారు. త్వరలోనే పెద్ద శంకరంపేటకు మరో డాక్టర్ ను  నియమిస్తామని చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రజల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను, ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వ రంగసంస్థలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆయన బుధవారం సిద్దిపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు సిద్దిపేటలో జరిగే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్మిక హక్కులను రక్షించాలని నిరంతరం పోరాటం చేస్తున్నది సీఐటీయూ మాత్రమేనని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, సహాయ కార్యదర్శి సింగిరెడ్డి చంద్రారెడ్డి, నాయకులు సధాకర్ అశోక్, నాగేందర్ రెడ్డి, యాదగిరి, పరశురాముడు, కరుణాకర్, కృష్ణమూర్తి, కనకరాజు, శ్రీకాంత్, కవిత, నవీన, మంగ, లక్ష్మి, శిరీష పాల్గొన్నారు.

టీచర్లను సర్దుబాటు చేయాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : జీవో 317 కారణంగా ఒక్కో స్కూల్​ నుంచి నలుగురు టీచర్లను ఇతర జిల్లాలకు కేటాయించారు.. ఆ తర్వాత అలాంటి పాఠశాలలకు ఏ ఒక్కరినీ కేటాయించకపోవడంతో చదువులు సరిగా సాగడం లేదని, వెంటనే టీచర్లను సర్దుబాటు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగారం శ్రీనివాస్, అనుముల రామచందర్ డిమాండ్​ చేశారు. ఇదే విషయమై బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఉపాధ్యాయుల బదిలీలు, ఏడేళ్ల నుంచి పదోన్నతులు లేవన్నారు. మరోవైపు ఉపాధ్యాయుల పదవీ విరమణతో కొరత ఏర్పడుతుందని తెలిపారు. నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సేవల గ్రామబద్దీకరణ ఉత్తర్వులను జాప్యం లేకుండా పూర్తిచేయాలని కోరారు. 

మొక్కజొన్న కుప్పలకు నిప్పు

దుబ్బాక, వెలుగు: గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న జూళ్లకు నిప్పు పెట్టడడంతో చేతికొచ్చిన పంట బుగ్గిపాలైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మండల రాజయ్య తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్నను సాగు చేశాడు. చేతికొచ్చిన పంటను కటింగ్​ చేసి కుప్పలుగా వేశాడు. బుధవారం ఉదయం రాజయ్య తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా కుప్పలు కాలిపోతున్నాయి. నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రూ. లక్ష వరకు నష్టం వాటిళ్లందని బాధితుడు వాపోయాడు. నిందితులను గుర్తించి తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ మేరకు మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

టెన్త్​ ఎగ్జామ్ ఫీజు 15లోగా​ చెల్లించాలి

మెదక్​ టౌన్, వెలుగు :  మార్చి 2023లో జరిగిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా పరీక్ష ఫీజును సంబంధిత హెడ్మాస్టర్లకు  చెల్లించాలని మెదక్​ డీఈవో రమేశ్​ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  స్టూడెంట్స్​ నుంచి తీసుకున్న ఫీజును హెడ్మాస్టర్లు తమకు  సూచించిన తేదీలోగా ఎస్​బీఐలో  చలానా ద్వారా  డీడీవో కోడ్​  25000303001 0202 హెడ్ ఆఫ్ అకౌంట్​లో జమ చేయాలని పేర్కొన్నారు.

ఇంటర్​ స్టూడెంట్స్​కు 100 శాతం సిలబస్

దుబ్బాక, వెలుగు: ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్​స్టూడెంట్స్​కు వంద శాతం సిలబస్ ఉంటుందని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్​ విద్యాధికారి సూర్య ప్రకాశ్​తెలిపారు. బుధవారం దుబ్బాక ప్రభుత్వ జూనియర్​ కాలేజీని ఆయన సందర్శించి మాట్లాడారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్​ విద్యార్థులకు సిలబస్  తగ్గించామని, సాధారణ పరిస్థితులు రావడంతో 100 శాతం సిలబస్​ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన  టెక్ట్స్​ బుక్స్​ ఇంటర్​ బోర్డ్​ పంపిణీ చేసిందన్నారు. ఒకేషనల్​ కోర్సుల విద్యార్థులకు కరోనా కారణంగా నిలిచిపోయిన ఓజేటీ కార్యక్రమంలో ఈ ఏడాది నిర్ణీత సమయం ప్రకారం కొనసాగుతుందన్నారు. కళాశాలకు విద్యార్థులు విధిగా హాజరై సబ్జెక్టుల్లో పూర్తి పట్టును సాధించాలని సూచించారు. ఓజేటీలో భాగంగా దుబ్బాక విద్యుత్​ సబ్​స్టేషన్​లో కరెంట్​ సరఫరాపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం డీఐఈఓను జూనియర్​ కళశాల ప్రిన్సిపాల్​లక్ష్మీనారాయణ, సిబ్బంది సన్మానించారు. 

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం 

సిద్దిపేట జిల్లా కొత్త కమిటీ ఎన్నిక

సిద్దిపేట రూరల్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా కొత్త కమిటీని బుధవారం ఎన్నుకున్నారు.  జిల్లా అధ్యక్షుడు కాల్వ సురేశ్​కుమార్, ప్రధాన కార్యదర్శి కెమ్మసారం రవీందర్, గౌరవ అధ్యక్షుడు బండి నర్సింలు, కోశాధికారి జక్కుల కిష్టయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు బండి సమ్మయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నె హేమచందర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు డీఈవో శ్రీనివాస్ రెడ్డిని కలసి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మాడుగుల శివరాజం, ఎర్మని ప్రభాకర్, ఎల్లేశ్, బత్తుల బాలు, అశోక్, సెక్టోరియల్ ఆఫీసర్  రామస్వామి, ఏఎస్ వో నర్సింహచారి పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం టీఆర్ఎస్ కు పట్టుకుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాaలని చూసిన అధికార పార్టీని అక్కడి ప్రజలు  తిరస్కరించడంతో  బీజేపీ కార్యకర్తలు, నాయకులపై ఆ పార్టీ నాయకులు భౌతికదాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇకనైనా దాడులు ఆపకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.   - వెలుగు, నెట్​వర్క్​