కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్ల వేలం .. వారం రోజుల్లో ఆర్టీఏకు 5 కోట్లు

కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్ల వేలం .. వారం రోజుల్లో ఆర్టీఏకు 5 కోట్లు
  •     ఫ్యాన్సీ నంబర్ల వేలంతో రూ.2.48 కోట్లు 
  •     ఫీజుల ద్వారా రూ.3.10 కోట్ల ఆదాయం
  •     ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటా పోటీగా బిడ్లు

హైదరాబాద్, వెలుగు: వాహనాల రిజిస్ట్రేషన్ లో టీజీ ప్రారంభంతో ఆర్టీఏకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఫ్యాన్సీ నంబర్ల కోసం కొత్త వాహనదారులు ఎగబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో భారీగా ఆదాయం సమకూరుతోందని అధికారులు తెలిపారు. ఈ నెల15వ తేదీ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లలో టీజీ అమలు ప్రారంభమైంది. మొదటి రోజే భారీగా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజున ఫీజుల ద్వారా రూ.1,25,11,000  ఆదాయం రాగా ఫ్యాన్సీ నంబర్ల వేలంతో రూ.1,26,75,437 ఆదాయం వచ్చింది. టీజీ ప్రారంభమైన మొదటి రోజే ఆర్టీఏకు రూ.2,51,86,437 ఆదాయం సమకూరగా ఆరు రోజుల్లో ఈ మొత్తం డబుల్ అయ్యింది. గురువారం నాటికి ఆదాయాన్ని పరిశీలిస్తే మొత్తం ఫీజుల ద్వారా రూ.3.10,74,200 ఆదాయం రాగా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ2,48,48,678 ఆదాయం కలిపి మొత్తం రూ.5,59,22,878  ఆదాయం సమకూరినట్టు హైదరాబాద్​ జేటీసీ రమేశ్ కుమార్ తెలిపారు.

పాత స్లాట్లకు టీఎస్ నంబరే

గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ మూడు జిల్లాల నుంచి కూడా భారీగా ఆదాయం వచ్చింది. హైదరాబాద్ నుంచి రూ.1,19,97,897, రంగారెడ్డిజిల్లా పరిధిలో రూ.99,67,491, మేడ్చల్ జిల్లా పరిధిలో రూ.78,86,501 ఆదాయం సమకూరింది. అన్ని కార్యాలయాల్లో టీజీతో పాటు 0001 కొత్త సీరిస్ ప్రారంభం కావడంతో వాహనాల రిజిస్ట్రేషన్‌‌‌‌కు సంబంధించి కొత్త కోడ్ భారీగా కాసులు కురిపిస్తున్నది. ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవడానికి వాహనదారులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పోటాపోటీగా బిడ్డింగ్ చేశారు. టీజీ ప్రారంభమైన మొదటి రోజునే  ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టీజీ 09,0001 నెంబర్ ఏకంగా రూ.9,61,111 ధర పలకడం విశేషం. టీజీ 09 0909, టీజీ 09 0005, టీజీ 09 0002, టీజీ 09 0369, టీజీ 09 0007 నంబర్ ప్లేట్లకు వరుసగా రూ.2.30 లక్షలు, రూ.2.21 లక్షలు, రూ.1.2 లక్షలు, రూ.1.20 లక్షలు, రూ.1,07 లక్షలు పలికాయి. మొత్తం రూ.30,49,589 ఆదాయం వచ్చింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్ కోడ్‌‌‌‌తోనే అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరో వారం రోజుల వరకు పాత స్లాట్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసినవారికి మాత్రం టీజీ కోడ్ సిరీస్‌‌‌‌ను కేటాయిస్తున్నారు. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే టీజీ నంబర్ ప్లేట్‌‌‌‌లు లభిస్తున్నాయి.