హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాజీవ్ స్వగృహ ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. మొత్తం వంద ప్లాట్లను వేలం వేయగా 240 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొని, ప్లాట్లను కొనుగోలు చేశారు. గజం రూ.25 వేలుగా అధికారులు ధర ఖరారు చేయగా, కార్నర్ ప్లాట్ల కోసం బిడ్డర్లు పోటీ పడ్డారు. అత్యధికంగా గజం రూ.67,500 పలికిందని, యావరేజ్‌గా రూ.33 వేలు పలికిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
మొత్తం వంద ప్లాట్లను వేలం వేయగా 96 ప్లాట్లు అమ్ముడయ్యాయని, వీటి ద్వారా రూ.105 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మిగతా ప్లాట్లకు సింగిల్ బిడ్ రావడంతో వేలం వేయలేదని తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు అనువుగా ఉన్న 300 నుంచి 450 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లకు వేలం నిర్వహించారు.
