హైదరాబాద్, వెలుగు: స్టార్టప్ ఇన్నోవేటర్ల కోసం హైదరాబాద్‌లో ఆగస్టు ఫెస్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఒకప్పుడు ఎంట్రప్రెనార్షిప్పై దృష్టిపెట్టిన ఈ ఫెస్ట్ ఇప్పుడు టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తోంది. భారతదేశం 2047 నాటికి 30 ట్రిలియన్డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జీడీపీని 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
దీనివల్ల జాతీయ జీడీపీకి రాష్ట్రం వాటా 5శాతం నుంచి 10శాతంకి పెరుగుతుందని చెప్పారు. స్టార్టప్ల ద్వారా సమాజానికి మేలు చేసిన ఇన్నోవేటర్లను కూడా సందర్భంగా సత్కరించారు. ఈ ఫెస్టివల్లో 250 మంది పెట్టుబడిదారులు, 300 కార్పొరేట్లు పాల్గొన్నారు. 200 స్టాల్స్‌లో స్టార్టప్‌లు వాటి ప్రొడక్టులను ప్రదర్శించాయి.
