స్లో పిచ్‌లతో మమ్మల్ని ఓడించలేరు.. ఆస్ట్రేలియా కుట్రలను తిప్పికొడతాం: పాక్ టీం డైరెక్టర్

స్లో పిచ్‌లతో మమ్మల్ని ఓడించలేరు.. ఆస్ట్రేలియా కుట్రలను తిప్పికొడతాం: పాక్ టీం డైరెక్టర్

శుక్రవారం(డిసెంబర్ 14) నుంచి కంగారూల గడ్డపై ఆస్ట్రేలియా- పాకిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు తాము అన్ని విధాలా సన్నద్ధమయ్యామని పాక్ టీమ్ డైరెక్టర్, ఆ జట్టు ప్రధాన కోచ్ మహ్మద్ హఫీజ్ తెలిపారు. అయితే, కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిష్టర్ 11తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ కోసం స్లో పిచ్‌ సిద్ధం చేయడాన్ని హఫీజ్ తప్పుబట్టాడు.

పెర్త్‌లో మీడియాతో మాట్లాడిన హఫీజ్.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో వికెట్‌పై ఆఫర్ రావడం తనను ఆశ్చర్యపరిచిందని, అయితే తమ జట్టు ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉందని తెలిపాడు. 

"టెస్టు మ్యాచ్‌ల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అది సర్వసాధారణం. కాన్‌బెర్రాలో ట్రాక్ నెమ్మదిగా ఉంటుందని ముందుగానే అనుకున్నాం. అయితే, ఈ విధమైన ఏర్పాట్లు జరుగుతాయని అనుకోలేదు. దీంతో కాస్త నిరాశ చెందాం. ఈ విషయం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియాను నిందించడంలో అర్థం లేదు. ఇది వారి వ్యూహాల్లో ఒకటి కావచ్చు. ఎటువంటి సాకు చెప్పదలచుకోలేదు. మేము అన్నింటికీ సిద్ధం. అయితే ఇంతకుముందు ఆస్ట్రేలియా సందర్శించిన జట్లకు అందించిన అత్యంత నెమ్మదిగా పిచ్ ఇదే అని మాత్రం చెప్పగలను.."

"సొంత గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇక్కడికి వచ్చాం. విజయం కోసం కుర్రాళ్ళు ఆకలితో ఉన్నారు. కొన్ని రోజుల్లోనే మా వాళ్లు ఇక్కడి వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. ఆస్ట్రేలియా నుంచి ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి ఉత్సాహంగా ఉన్నారు.  కంగారులను ఓడించగలం.."

"మసూద్‌కి టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల నేనేమి ఆశ్చర్యపోలేదు. అతడు పాకిస్థాన్‌కు నాయకత్వం వహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. అతను మంచి బ్యాటర్, అంతకంటే అద్భుతమైన నాయకుడు. ఆటగాళ్లతో అతనికి మంచి అనుబంధం ఉంది. అతను ఇంగ్లాండ్‌ పర్యటనలో కెప్టెన్సీ గురించి తెలుసుకున్నాడు. ఆ అనుభవాన్ని కొనసాగిస్తాడు..:" అంటూ హఫీజ్ గంటల పాటు పాక్ క్రికెటర్ల గొప్పలు చెప్పాడు. వారు ఈ మాటలకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.

పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్ (డిసెంబర్ 14 - డిసెంబర్ 18): పెర్త్ స్టేడియం, పెర్త్
  • రెండో టెస్ట్ (డిసెంబర్ 26 - డిసెంబర్ 30): మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్
  • మూడో టెస్ట్ (జనవరి 03- జనవరి 07): సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ