ఆసీస్ బౌలర్లా! తొక్కా.. పిండేశారు: శివాలెత్తిన డేవిడ్ మిల్లర్ - హెన్రిచ్ క్లాసెన్

ఆసీస్ బౌలర్లా! తొక్కా.. పిండేశారు: శివాలెత్తిన డేవిడ్ మిల్లర్ - హెన్రిచ్ క్లాసెన్

సిరీస్ రేసులో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు వీరవిహారం చేశారు. గంభీరాలు పలికే ఆస్ట్రేలియా బౌలర్లను నిర్ధాక్షిణంగా ఊచకోత కోశారు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ప్రోటీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లతో 416 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలి 35 ఓవర్లు ఒక ఎత్తైతే.. చివరి 15 ఓవర్లు మరో ఎత్తు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్ బ్యాటర్లు మొదటి 35 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేశారు. అప్పటివరకూ ఆసీస్ వైపు ఉన్న మ్యాచ్.. చివరి 15 ఓవర్లలో సౌతాఫ్రికా వైపు మారిపోయింది. డేవిడ్ మిల్లర్(82; 45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు) - హెన్రిచ్ క్లాసెన్( 174; 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సులు) ద్వయం  ఆసీస్ బౌలర్లను ఉతికారేశారు. ప్రతి ఓవర్‌లో మూడు నుండి నాలుగేసి బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 94 బంతుల్లో ఏకంగా 222 పరుగులు చేశారు.

వీరిద్దరిని కట్టడి చేయలేక ఆసీస్ బౌలర్లు చేతులెత్తేస్తే.. ఆ జట్టు ఫీల్డర్లు బౌండరీ లైన్ వద్ద నిల్చొని ప్రేక్షక పాత్ర వహించారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా తన 10 ఓవర్లలో 113 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

కాగా, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ముందంజలో ఉంది.