వరల్డ్ కప్: ఇంగ్లండ్ ను ఉతికేసిన ఆసీస్

వరల్డ్ కప్: ఇంగ్లండ్ ను ఉతికేసిన ఆసీస్
  • ఆరో విజయంతో సెమీస్ లో కంగారూలు
  • ఇంగ్లండ్ పై 64 రన్స్ తేడాతో గెలుపు
  • ఫించ్ సెంచరీ, చెలరేగిన బెరెన్‌‌డార్ఫ్‌‌, స్టార్క్‌‌

బాల్‌‌ టాంపరింగ్‌‌ ఘటన జరిగి  ఏడాదిన్నర అయినా తమను చీటర్స్‌‌ చీటర్స్‌‌ అంటూ హేళనచేస్తున్న  ఇంగ్లండ్‌‌ ఫ్యాన్స్‌‌కు  ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాకిచ్చింది. క్రికెట్‌‌ మక్కా లార్డ్స్​ మైదానంలో వరల్డ్‌‌కప్‌‌ ఫేవరెట్‌‌ ఇంగ్లండ్‌‌ను వారి అభిమానుల మధ్య చిత్తు చేసి కాలరెగరేసింది. ఆరో వరల్డ్‌‌కప్‌‌ వేటలో ఉన్న కంగారూ టీమ్‌‌ అదిరే ఆటతో  విజయాల సిక్సర్‌‌ కొట్టి అందరికంటే ముందు సెమీఫైనల్‌‌ బెర్త్‌‌ ఖాయం చేసుకుంది. గత మ్యాచ్‌‌లో బలహీన శ్రీలంక చేతిలో బోల్తా పడ్డ  మోర్గాన్‌‌సేన తన చిరకాల ప్రత్యర్థి కంగారూ టీమ్‌‌ ముందు కూడా తేలిపోయింది. మెరుగైన బౌలింగ్​తో ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నా.. బ్యాటింగ్‌‌లో మరోసారి నిరాశ పరిచింది. ఆసీస్‌‌ లెఫ్టామ్​ పేసర్లు బెరెన్‌‌డార్ఫ్‌‌, స్టార్క్‌‌ ధాటికి  విలవిల్లాడిన మోర్గాన్​సేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. సెమీస్‌‌ చేరాలంటే ఇండియా, న్యూజిలాండ్‌‌తో జరిగే చివరి రెండు మ్యాచ్‌‌ల్లో ఒకదానిలో కచ్చితంగా నెగ్గి తీరాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.

లార్డ్స్‌‌: బ్యాటింగ్‌‌ వైఫల్యం మరోసారి ఇంగ్లండ్‌‌ కొంపముంచింది.  గత మ్యాచ్‌‌లో శ్రీలంక చేతిలో కంగుతున్న ఆ జట్టు  చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది.     కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ (116 బంతుల్లో  11 ఫోర్లు, 2 సిక్సర్లతో 100) సెంచరీకి తోడు  బెరెన్‌‌డార్ఫ్‌‌(5/44), మిచెల్‌‌ స్టార్క్‌‌(4/43) యార్కర్లతో రెచ్చిపోవడంతో మంగళవారం లార్డ్స్‌‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌‌లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ఆస్ట్రేలియా 64 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌పై గెలిచింది.  తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.  ఆరోన్‌‌తో పాటు డేవిడ్‌‌ వార్నర్‌‌( 61 బంతుల్లో 6 ఫోర్లతో 53) హాఫ్‌‌ సెంచరీతో రాణించాడు.   క్రిస్‌‌ వోక్స్‌‌(2/46) రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌లో బెరెన్‌‌డార్ఫ్‌‌, స్టార్క్​ ధాటికి.. ఇంగ్లండ్‌‌ 44.4 ఓవర్లలో 221 రన్స్‌‌కే ఆలౌటై చిత్తుగా ఓడింది. బెన్‌‌ స్టోక్స్‌‌ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 89) ఒక్కడే రాణించాడు.  ఫించ్‌‌ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా ఎంపికయ్యాడు.

స్టోక్స్‌‌ ఒంటరి పోరాటం..

టార్గెట్‌‌ 286.. ఇన్నింగ్స్‌‌ ప్రారంభం కాకముందు  ఇంగ్లండ్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌కు ఇదో లెక్కా అనిపించింది. కానీ ఆసీస్‌‌ పేస్‌‌ దెబ్బకు క్రీజులో నిలవలేకపోయిన ఆ జట్టు బ్యాట్స్‌‌మెన్‌‌ కాసేపటికే వామ్మో అంతా అనిపించారు. ఒంటరి పోరాటంతో  ఫించ్‌‌సేనను కాసేపు కంగారుపెట్టిన  స్టోక్స్‌‌ ఇన్నింగ్స్‌‌ కూడా  లేకపోతే ఇంగ్లండ్‌‌కు ఇంకా పెద్ద స్ట్రోక్‌‌ తగిలేది. ఛేజింగ్‌‌లో ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌‌ కోల్పోయిన ఆ జట్టు ఆరు ఓవర్లు ముగిసే సరికే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి డీలా పడింది. అదిరిపోయే ఇన్‌‌స్వింగింగ్‌‌ యార్కర్‌‌తో ఓపెనర్‌‌ జేమ్స్‌‌ విన్స్‌‌(0)ను ఇన్నింగ్స్‌‌ రెండో బంతికి బెరెన్‌‌డార్ఫ్‌‌ బౌల్డ్‌‌ చేసి తొలి దెబ్బ తీయగా,  ఇన్‌‌ఫామ్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ జో రూట్‌‌(8), ఇయాన్‌‌ మోర్గాన్‌‌(4)ను స్టార్క్‌‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌‌ చేర్చి దెబ్బమీద దెబ్బ కొట్టాడు. దాంతో, 5.5 ఓవర్లకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌‌ తొలి పవర్‌‌ ప్లేలో కేవలం 39 పరుగులే చేసింది. మరో ఓపెనర్‌‌ బెయిర్‌‌స్టో(27), బెన్‌‌ స్టోక్స్‌‌తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.  కానీ,14వ ఓవర్‌‌లో జానీని ఔట్‌‌ చేసిన బెరెన్‌‌డార్ఫ్‌‌ ప్రత్యర్థికి మరోమారు షాకిచ్చాడు. ఈ దశలో  బట్లర్‌‌(25), స్టోక్స్‌‌  81 బంతుల్లో 71 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌‌ కోలుకున్నట్టే కనిపించింది. కానీ, స్టొయినిస్‌‌ వేసిన 28వ ఓవర్‌‌లో  భారీ షాట్‌‌ ఆడిన బట్లర్‌‌ డీప్‌‌ స్క్వేర్‌‌లెగ్‌‌లో ఖవాజకి క్యాచ్‌‌ ఇవ్వడంతో హోమ్‌‌టీమ్‌‌  పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత  క్రిస్‌‌ వోక్స్‌‌(26), స్టోక్స్‌‌కు మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో 75 బంతుల్లో  హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్‌‌ నెమ్మదిగా గేరు మార్చాడు. మ్యాక్స్‌‌వెల్‌‌ వేసిన 31వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌‌లు,  కమిన్స్‌‌ వేసిన 36వ ఓవర్‌‌లో రెండు బౌండరీలు కొట్టి ఆశలు రేకెత్తించాడు.  అయితే 37వ ఓవర్‌‌లో మరోసారి బంతిని అందుకున్న స్టార్క్‌‌ మాయ చేశాడు. మ్యాచ్‌‌కే హైలైట్‌‌ అనిపించిన కళ్లు చెదిరే యార్కర్‌‌తో స్టోక్స్‌‌ వికెట్‌‌ను లేపేసి ఇంగ్లండ్‌‌ ఆశలు ఆవిరి చేశాడు. ఆ తర్వాత మొయిన్‌‌ అలీ(6), వోక్స్‌‌, ఆర్చర్‌‌ (1) ను చకచకా పెవిలియన్‌‌ చేర్చిన బెరెన్‌‌డార్ఫ్‌‌ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఆపై ఆదిల్‌‌ రషీద్‌‌(25)ను ఔట్‌‌ చేసిన స్టార్క్‌‌ లాంఛనం పూర్తి చేశాడు.

అదరగొట్టిన ఫించ్‌‌

ఆసీస్‌‌ ఇన్నింగ్స్‌‌లో కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ ఆటే హైలైట్.  ఫించ్‌‌, వార్నర్‌‌   వేసిన బలమైన పునాదిని సద్వినియోగం చేసుకొని ఉంటే ఆ జట్టు భారీ స్కోరు చేసేది. ఒక దశలో 173/1తో బలమైన స్థితిలో నిలిచినా.. ఇంగ్లిష్‌‌ బౌలర్లు పుంజుకోవడంతోపాటు మిగిలిన బ్యాట్స్‌‌మెన్‌‌ పేలవంగా ఆడడంతో ప్రత్యర్థి ముందు ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్‌‌ ఫించ్‌‌, డేవిడ్‌‌ వార్నర్‌‌ తొలి వికెట్‌‌కు 123 రన్స్‌‌ జోడించి  అదిరిపోయే ఆరంభం ఇచ్చారు.  ఈ ఇద్దరూ ఫస్ట్‌‌ వికెట్‌‌కు 50 కంటే ఎక్కువ రన్స్‌‌ జోడించడం ఈ వరల్డ్‌‌కప్‌‌లో ఇది వరుసగా ఐదో సారి.  ఫుల్‌‌ఫామ్‌‌లో ఉన్న ఫించ్‌‌ బౌండరీలతో చెలరేగగా, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టిన వార్నర్‌‌ అతనికి సహకరించాడు. హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌‌ను 23వ ఓవర్‌‌లో ఔట్‌‌ చేసిన మొయిన్‌‌ అలీ ఇంగ్లండ్‌‌కు తొలి బ్రేక్‌‌ ఇచ్చాడు. 15  పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విన్స్‌‌ క్యాచ్‌‌ వదిలేయడంతో వచ్చిన లైఫ్‌‌ను పూర్తిగా వినియోగించుకున్న  ఫించ్‌‌ 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ వరల్డ్‌‌కప్‌‌లో అతనికిది రెండో సెంచరీ కాగా, ఓవరాల్‌‌గా 15వది. అయితే సెంచరీ పూర్తి చేసిన తర్వాతి బాల్‌‌కే అతను పెవిలియన్‌‌ చేరాడు. 36వ ఓవర్‌‌లో ఆర్చర్‌‌కు ఈ వికెట్‌‌ దక్కింది. అంతకుముందు  వన్‌‌డౌన్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ ఉస్మాన్‌‌ ఖవాజ(23)ను 33వ ఓవర్‌‌లో స్టోక్స్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్‌‌ స్మిత్‌‌(38) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ జాగ్రత్తగా ఆడాడు. దూకుడుగా ఆడిన మ్యాక్స్‌‌వెల్‌‌(12), స్టొయినిస్‌‌(8) వెంటవెంటనే ఔటవడంతో స్కోరు వేగం తగ్గిపోయింది. మ్యాక్సీని వుడ్‌‌ ఔట్‌‌ చేయగా, స్మిత్‌‌తో సమన్వయలోపం వల్ల స్టొయినిస్‌‌ రనౌటయ్యాడు. వోక్స్‌‌ వేసిన 46వ ఓవర్‌‌లో ఆసీస్‌‌ 250 మార్కు దాటిన వెంటనే  స్మిత్‌‌ పెవిలియన్‌‌ చేరాడు.  ఆఖర్లో మెరుపులు మెరిపించిన అలెక్స్‌‌ కారీ(27 బంతుల్లో 5 ఫోర్లతో 38 నాటౌట్‌‌) విలువైన పరుగులు చేశాడు. స్టోక్స్‌‌ వేసిన ఇన్నింగ్స్‌‌ లాస్ట్‌‌ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టి జట్టు స్కోరు 280 మార్కు దాటించాడు.

స్కోర్‌‌బోర్డ్‌‌

ఆస్ట్రేలియా : ఫించ్‌‌ (సి) వోక్స్‌‌ (బి) ఆర్చర్‌‌ 100, వార్నర్‌‌ (సి)రూట్‌‌ (బి) అలీ 53, ఖవాజ (బి) స్టోక్స్‌‌ 23,  స్మిత్‌‌ (సి) ఆర్చర్‌‌ (బి) వోక్స్‌‌ 38, మాక్స్‌‌వెల్‌‌ (సి) బట్లర్‌‌ (బి) వుడ్‌‌ 12, స్టొయినిస్‌‌ (రనౌట్‌‌) 8, కారీ (నాటౌట్‌‌) 38, కమిన్స్‌‌ (సి) బట్లర్‌‌ (బి) వోక్స్‌‌ 1 , స్టార్క్‌‌ (నాటౌట్‌‌) 4 ; ఎక్స్‌‌ట్రాలు : 8 ; మొత్తం : 50 ఓవర్లలో 285/7 ; వికెట్ల పతనం : 1–123, 2–173, 3–185, 4–213, 5–228, 6–250, 7–259 ; బౌలింగ్‌‌ : వోక్స్‌‌ 10–0–46–2, ఆర్చర్‌‌ 9–0–56–1, వుడ్‌‌ 9–0–59–1, స్టోక్స్‌‌ 6–0–29–1, అలీ 6–0–42–1, రషీద్‌‌ 10–0–49–0.

ఇంగ్లండ్‌‌ :  విన్స్‌‌ (బి) బెరెన్‌‌డార్ఫ్‌‌ 0, బెయిర్‌‌ స్టో (సి) కమిన్స్‌‌ (బి) బెరెన్‌‌డార్ఫ్‌‌ 27, రూట్‌‌ (ఎల్బీ) స్టార్క్‌‌ 8, మోర్గాన్‌‌ (సి) కమిన్స్‌‌ (బి) స్టార్క్‌‌ 4, స్టోక్స్‌‌ (బి) స్టార్క్‌‌ 89, బట్లర్‌‌ (సి) ఖవాజ (బి) స్టొయినిస్‌‌ 25, వోక్స్‌‌ (సి) ఫించ్‌‌ (బి) బెరెన్‌‌డార్ఫ్‌‌ 4, అలీ (సి) కారీ (బి) బెరెన్‌‌డార్ఫ్‌‌ 6, రషీద్‌‌ (సి) స్టొయినిస్‌‌ (బి) స్టార్క్‌‌ 25, ఆర్చర్‌‌(సి) వార్నర్‌‌ (బి) బెరెన్‌‌డార్ఫ్‌‌ 1, వుడ్‌‌ (నాటౌట్‌‌) 1 ; ఎక్స్‌‌ట్రాలు : 9; మొత్తం : 44.4 ఓవర్లలో 221 ఆలౌట్‌‌; వికెట్ల పతనం :  1–0, 2–15, 3–26, 4–53, 5–124, 6–177, 7–189, 8–202, 9–211, 10–221 ; బౌలింగ్‌‌ : బెరెన్‌‌డార్ఫ్‌‌ 10–0–44–5, స్టార్క్‌‌ 8.4–1–43–4, కమిన్స్‌‌ 8–1–41–0, లైయన్‌‌ 9–0–43–0, స్టొయినిస్‌‌ 7–0–29–1, మాక్స్‌‌వెల్‌‌ 2–0–15–0.