Cricket World Cup 2023: జాగ్రత్తగా ఆడాల్సిందే: 24 ఏళ్లలో ఒక్క ఫైనల్ ఓడిపోని ఆస్ట్రేలియా

Cricket World Cup 2023: జాగ్రత్తగా ఆడాల్సిందే: 24 ఏళ్లలో ఒక్క ఫైనల్ ఓడిపోని ఆస్ట్రేలియా

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఎంత ప్రమాదకరమైన జట్టు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండు కాదు ఏకంగా 5 సార్లు విశ్వ విజేతగా నిలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఆస్ట్రేలియా తర్వాత భారత్, వెస్టిండీస్ అత్యధికంగా 2 సార్లు  వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచాయంటే ప్రపంచ క్రికెట్ పై వారి ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ కప్ ఫైనల్ కి ఆ జట్టు వస్తే ఓడిపోవడం దాదాపు అసాధ్యం. ఒకసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ చరిత్ర పరిశీలిస్తే.. 

మొదటి మూడు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు పెద్దగా ఆకట్టుకోలేదు. 1975 లో సెమీస్ చేరిన ఆస్ట్రేలియా ఆ తర్వాత 1979, 1983 లో ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. 1987 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ పై తమదైన ముద్ర వేసింది. భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిధ్యమిచ్చిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తొలి సారి ఛాంపియన్ గా అవతరించింది. 1992 వరల్డ్ కప్ ఫైనల్లో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టినా 1996 లో వరల్డ్ కప్ రన్నరప్ గా నిలిచింది. శ్రీలంకపై జరిగిన ఈ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

24 ఏళ్లలో ఓటమే లేదు 

1999 నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ పై ఆధిపత్యం చూపించింది. ప్రపంచ క్రికెట్ దేశాలు ఆస్ట్రేలియాతో ఆడాలంటే భయపడిపోయేవి. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చిత్తుగా ఓడించేది. 1999 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఫైనల్లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ పై భారీ విజయంతో వరుసగా రెండో సారి విశ్వ విజేతగా నిలిచింది. 2007 వెస్టిండీస్ లో జరిగిన వరల్డ్ కప్ శ్రీలంకపై గెలిచి వరల్డ్ కప్ టైటిల్స్ హ్యాట్రిక్ కొట్టింది. 2011 లో భారత్ పై జరిగిన క్వార్ట్రర్ ఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా 2015 లో సొంతగడ్డపై ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు.

ఈ 24 ఏళ్లలో 7 వరల్డ్ కప్ లు ఆడిన కంగారూల జట్టు ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ తో మొత్తం 5 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చింది. వీటిలో ఆడిన 4 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఈజీగా గెలిచింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై మ్యాచ్ జరిగినా.. కంగారూల మీద కప్పు కొట్టాలంటే శక్తికి మించి పోరాడాల్సిందే. ఆసీస్ చివరిసారిగా 1996 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై ఓడింది. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత భారత్ ఓడిస్తుందేమో చూడాలి.