పాపం పాకిస్థాన్.. నెంబర్ వన్ అనుకుంటే ఇలా జరిగిందేంటి

పాపం పాకిస్థాన్.. నెంబర్ వన్ అనుకుంటే ఇలా జరిగిందేంటి

 

ప్రస్తుత పాకిస్థాన్ వన్డే జట్టు చాలా పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏడాదికి పైగా వన్డే క్రికెట్ లో తమ ఆధిపత్యం చూపిస్తూ ఇటీవలే  నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ లో నిజంగా ఇదొక గొప్ప విషయం. ఎందుకంటే కొన్ని దశాబ్దాల తర్వాత పాక్ ఈ ఘనతను అందుకోవడం విశేషం. గత వారమే పాకిస్థాన్ నెంబర్ వన్ వన్ డే టీంగా అవతరించింది. అయితే కనీసం 10 రోజులైనా ఆ ఆనందం బాబర్ సేనకు మిగలలేదు. తాజాగా ఆస్ట్రేలియా నెంబర్ వన్ కిరీటాన్ని చేజిక్కించుకుంది.

వన్డేల్లో నెంబర్ వన్ గా ఆస్ట్రేలియా         
 

2023 సెప్టెంబర్ 5 వరకు 119 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. 118 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఆసీస్ నిలిచింది. నిన్న దక్షిణాఫ్రికా మీద తొలి వన్డేలో విజయం సాధించిన ఆసీస్.. తమకు అలవాటైన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఈ మ్యాచులో ఒకదశలో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టుని గ్రీన్ ప్లేస్ లో కాన్కషన్ సబ్ స్ట్యూట్ కింద వచ్చిన లబుషేన్ 80 పరుగులు చేసి అనూహ్య విజయాన్ని అందించాడు. 

పాక్ కి కష్టమే
 
ప్రస్తుతం పాకిస్థాన్ ఆసియా కప్ ఆడుతుండగా.. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో 5 వన్డేల సిరీస్ లో తలపడబోతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆసియా కప్ గెలిస్తేనే తిరిగి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. మరో వైపు పటిష్టమైన ఆసీస్ జట్టు మరో నాలుగు వన్డేల్లో కనీసం మూడు మ్యాచులోనైనా గెలవాల్సి ఉంటుంది. ఆసియా కప్ గెలవడం పాకిస్థాన్ కి అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఫామ్ లో  ఉన్న ఆసీస్.. దక్షిణాఫ్రికాని ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. దీంతో ఆసీస్ నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.