
ఉమెన్స్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఆస్ట్రేలియా బిగ్ షాక్ ఇచ్చింది. భారత్ విధించిన 330 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేజ్ చేసింది. కెప్టెన్ అలిస్సా హీలీ (142) భారీ సెంచరీతో కదం తొక్కగా.. ఎల్లీస్ పెర్రీ (47), ఆష్లీ గార్డనర్ (45), లిచ్‌ఫీల్డ్ (40) రాణించడంతో 3 వికెట్ల తేడాతో ఇండియాను చిత్తు చేసింది ఆస్ట్రేలియా.
ఆదివారం (అక్టోబర్ 12) విశాఖ పట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 48.5 ఓవర్లలో 330- పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (75), స్మృతి మందాన (80) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా.. హర్లీన్ డియోల్ (38), జెమీమా రోడ్రిగ్స్ (33), రిచా ఘోష్ (32) రాణించారు.
అన్నాబెల్ సదర్లాండ్ 5 వికెట్లతో మెరవగా.. సోఫీ మోలినెక్స్ 3, గార్డనర్, స్కౌట్ చెరో వికెట్ తీశారు. అనంతరం 331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసింది. కెప్టెన్ అలిస్సా హీలీ (142) సెంచరీతో చెలరేగగా.. ఎల్లీస్ పెర్రీ (47), ఆష్లీ గార్డనర్ (45), లిచ్‌ఫీల్డ్ (40) సమిష్టిగా రాణించారు.
ఆస్ట్రేలియా బ్యాటర్ల ముందు ఇండియా బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక ఇండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో శ్రీ చరణి 3, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ కౌర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ పరాభవంతో వరల్డ్ కప్‌లో ఇండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన భారత్ రెండు గెలిచి.. మరో రెండింట్లో ఓటమి చవిచూసింది.