క్వీన్ రిబకినా.. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌ నెగ్గిన కజక్ ప్లేయర్

క్వీన్ రిబకినా.. తొలిసారి ఆస్ట్రేలియన్  ఓపెన్‌‌‌‌ నెగ్గిన కజక్ ప్లేయర్

మెల్‌‌‌‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్  విమెన్స్ సింగిల్స్‌‌‌‌లో మరో కొత్త చాంపియన్‌‌‌‌ వచ్చింది. మూడేండ్ల క్రితం ఇదే వేదికపై చేజారిన టైటిల్‌‌‌‌ను, అదే ప్రత్యర్థి నుంచి లాక్కుని కజకిస్తాన్ సంచలనం ఎలెనా రిబకినా తన కలని నెరవేర్చుకుంది. 

వరల్డ్ నంబర్ వన్, బెలారస్ స్టార్ అరీనా సబలెంకను ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని ముద్దాడింది. రాడ్ లేవర్ ఎరీనాలో శనివారం జరిగిన ఫైనల్లో ఐదో సీడ్‌‌‌‌ రిబకినా 6-4, 4-6, 6-4 తో టాప్ సీడ్ సబలెంకకు షాకిచ్చింది. 2022లో వింబుల్డన్ చాంపియన్‌‌‌‌గా నిలిచిన రిబకినాకు ఇది రెండో గ్రాండ్‌‌‌‌స్లామ్ టైటిల్.

తుదిపోరులో 6 ఏస్‌‌‌‌లు, 28 విన్నర్లు కొట్టిన రిబకినా.. 3 డబుల్ ఫాల్ట్స్‌‌‌‌, 25 అనవసర తప్పిదాలు చేసింది. 5 ఏస్‌‌‌‌లు,35 విన్నర్లు కొట్టిన సబలెంక రెండు డబుల్ ఫాల్ట్స్‌‌‌‌, 26 తప్పిదాలు చేసింది. తను రెండు పాయింట్లు రాబట్టగా.. మూడు బ్రేక్ పాయింట్లతో రిబకినా పైచేయి సాధించింది. 

కాగా, మెన్స్ డబుల్స్ టైటిల్‌‌‌‌ను నీల్ స్కుప్‌‌‌‌స్కీ (బ్రిటన్)– క్రిస్టియన్ హారిసన్ (అమెరికా) జంట కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ 7–-6(7/4), 6–-4తో ఆస్ట్రేలియాకు చెందిన వైల్డ్‌‌‌‌కార్డ్ ప్లేయర్స్ జేసన్ కుబ్లెర్– మార్క్ పోల్మన్స్‌‌‌‌ను  ఓడించి విజేతగా నిలిచింది.

కజక్‌‌‌‌ ప్లేయర్ ఖతర్నాక్ ఆట
 రెండు గంటల 18 నిమిషాల పాటు సాగిన  ఫైనల్ మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచే రిబకినా దూకుడు చూపెట్టింది.  సబలెంక సర్వీస్‌‌‌‌ను తొలి గేమ్‌‌‌‌లోనే బ్రేక్ చేసి షాక్ ఇచ్చింది. తన పవర్‌‌‌‌ఫుల్ ఫోర్‌‌‌‌హ్యాండ్ షాట్లతో సబలెంకను కోర్టు మూలల్లోకి పరిగెత్తించింది. ఫలితంగా 37 నిమిషాల్లోనే ఫస్ట్ సెట్‌‌‌‌ను కైవసం చేసుకుని ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, టాప్ సీడ్ ప్లేయర్ అరీనా అంత సులభంగా తలొగ్గలేదు. రెండో సెట్‌‌‌‌లో తన సర్వీస్ వేగాన్ని పెంచి రిబకినాను ఉక్కిరిబిక్కిరి చేసింది. 

పదో గేమ్‌‌‌‌లో కజక్ ప్లేయర్ సర్వీస్‌‌‌‌ను బ్రేక్ చేసి సబలెంక మ్యాచ్‌‌‌‌ను మూడో సెట్‌‌‌‌కు తీసుకెళ్లింది. అందులో వరుసగా గేమ్‌‌‌‌లు గెలుస్తూ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో  ఆమె విజయం ఖాయమని అనుకున్నారు. కానీ అప్పుడే రిబకినా తనలోని అసలైన పోరాట యోధురాలిని మేల్కొలిపింది. వరుసగా ఐదు గేమ్‌‌‌‌లు గెలిచి మ్యాచ్‌‌‌‌ను తన వైపుకు తిప్పుకుంది. చివరికు ఓ  బుల్లెట్ లాంటి ఏస్ తో మ్యాచ్‌‌‌‌ను ముగించింది.