
- జనరల్ ఎలక్షన్స్‌లో వరుసగా రెండోసారి విజయం
- 21 ఏండ్లలో ఈ రికార్డు సాధించిన మొదటి ఆస్ట్రేలియన్
- ఆల్బనీస్‌కు ప్రధాని మోదీ అభినందనలు
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ ఆంతొనీ ఆల్బనీసే ఎన్నికయ్యారు. జనరల్ ఎలక్షన్స్ లో వరుసగా రెండోసారి ఆయన విజయం సాధించారు. 21 ఏండ్లలో వరుసగా రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించిన మొదటి ఆస్ట్రేలియన్ గా ఆల్బనీస్ రికార్డు సృష్టించారు. జనరల్ ఎన్నికల ఫలితాలను ఆస్ట్రేలియా ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం 150 సీట్లు ఉన్న ప్రతినిధుల సభలో ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి 70 సీట్లు వచ్చాయి.
ప్రతిపక్ష కూటమికి 24 సీట్లు దక్కాయి. మైనర్ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 13 చోట్ల విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష నేత పీటర్ దట్టన్ స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ‘‘మేము సరిగా ప్రచారం చేయలేదు. ఆ విషయాన్ని ఒప్పుకుంటాను. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని ఆల్బీనీస్ కి ఫోన్ చేసి అభినందనలు చెప్పాను. లేబర్ పార్టీకి ఇది చరిత్రాత్మక విజయం” అని డట్టన్ పేర్కొన్నారు.
ఓటర్లకు ఆల్బనీస్ థ్యాంక్స్
దేశ ప్రధానిగా సేవచేసే అవకాశం కల్పించిన ఓటర్లకు ఆంతొనీ ఆల్బనీస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత సిడ్నీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ సందిగ్ధత నుంచి దేశాన్ని బయటపడేస్తానని ఆయన చెప్పారు. కాగా.. ప్రధానిగా రెండోసారి ఎన్నికైన ఆల్బనీస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆల్బనీస్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మోదీ చెప్పారు.
కరెక్ట్‌గా గెస్ చేసిన ఏబీసీ
ఎలక్షన్స్‌కు ముందు ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(ఏబీసీ) ఎన్నికల విశ్లేషకుడు ఆంటొనీ గ్రీన్ చెప్పిన జోస్యం దాదాపుగా ఫలించింది. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 76 సీట్లు వస్తాయని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గ్రీన్ అంచనా వేశారు. ఆయన చెప్పినట్లుగానే లేబర్ పార్టీకి 70 సీట్లు వచ్చాయి. అలాగే, ప్రతిపక్ష కూటమికి 36 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. 24 సీట్లు దక్కాయి. ఇండిపెండెంట్లు 13 చోట్ల విజయం సాధిస్తారని చెప్పగా.. కచ్చితంగా 13 చోట్ల వారే గెలిచారు. ప్రతిపక్ష కూటమి అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని స్పష్టం చేశారు.