
విశాఖపట్నం: విమెన్స్ వరల్డ్ కప్‌లో ఇండియాకు మరో ఎదురుదెబ్బ. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడిన ఆతిథ్య జట్టు ఈసారి ఆస్ట్రేలియా అడ్డు దాటలేకపోయింది. స్మృతి మంధాన (66 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80), ప్రతీక రావల్ (96 బాల్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 75) టాపార్డర్ సత్తా చాటడంతో భారీ స్కోరు చేసినా.. బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారు.
ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ (107 బాల్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142) భారీ సెంచరీతో చెలరేగడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విమెన్స్ వన్డేల్లో రికార్డు ఛేజింగ్ చేసి 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఓపెనర్ల మెరుపులతో తొలుత ఇండియా 48.5 ఓవర్లలో 330 రన్స్‌కు ఆలౌటైంది. అనాబెల్ సదర్లాండ్ (5/40) ఐదు, సోఫీ మోలినూక్స్ (3/75) మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఆసీస్ 49 ఓవర్లలో 331/7 స్కోరు చేసి గెలిచింది. ఎలీస్ పెర్రీ (47 నాటౌట్), ఆష్లే గార్డ్‌నర్ (45), లిచ్‌ఫీల్డ్ (40) కూడా సత్తా చాటారు. ఇండియా బౌలర్లలో శ్రీచరణి (3/41) మూడు, దీప్తి శర్మ (2/52), అమన్‌జోత్ (2/68) చెరో రెండు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. హీలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నెల 19న ఇండోర్‌లో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఇండియా పోటీ పడనుంది.
ఓపెనర్ల జోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతిక రావల్ అద్భుతమైన శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 24.3 ఓవర్లలోనే 155 రన్స్ భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశారు. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఈ జోడీ ఈ మ్యాచ్‌లో తమ లోపాలను సరిదిద్దుకుంది. తిరిగి ఫామ్ అందుకున్న మంధాన తనదైన స్టయిలిష్ షాట్లతో అలరించింది. ఏడో ఓవర్ వరకు పిచ్‌ను అంచనా వేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్, ఆసీస్ స్పిన్నర్ సోఫీ మోలినుక్స్ బౌలింగ్‌కు రాగానే గేర్ మార్చింది.
సిక్స్, రెండు ఫోర్లతో ఏకంగా 18 రన్స్ పిండుకుంది. అక్కడి నుంచి ఇండియా రన్‌రేట్ ఆరుకు తగ్గకుడా దూసుకెళ్లింది. మంధాన దూకుడుగా ఆడగా, ప్రతీక చక్కటి సహకారం అందించింది. వీరిద్దరి ఇన్నింగ్స్‌లో భారీ షాట్ల కన్నా పర్ఫెక్ట్ టైమింగ్, కచ్చితమైన ప్లేస్‌మెంట్స్ ప్రధాన ఆయుధాలుగా నిలిచాయి. ఈ క్రమంలో మంధాన 46 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, కాస్త నెమ్మదిగా ఆడిన రావల్ 69 బాల్స్ హాఫ్ సెంచరీ మార్కును అందుకుంది.
అయితే, భారీ షాట్‌కు ప్రయత్నించి మంధాన అనూహ్యంగా ఔటైంది. మోలినుక్స్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ఆడబోయి, డీప్‌లో లిచ్‌ఫీల్డ్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది. ఇన్‌ఫామ్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (38)తో కలిసి ముందుకెళ్లిన రావల్‌ను 31వ ఓవర్లో మోలినుక్స్ ఔట్ చేయగా.. క్రీజులో కుదురుకున్న తర్వాత అనవసర షాట్ ఆడే ప్రయత్నంలో కెప్టెన్ హర్మన్ (22) మేగన్‌కు వికెట్ ఇచ్చుకుంది.
దాంతో ఇండియా 38వ ఓవర్లకు 240/4తో నిలిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (32), జెమీమా (33) ఐదో వికెట్‌కు 54 రన్స్ జోడించి స్కోరు 300 మార్కు వైపు నడిపించారు. అయితే, ఆసీస్ పేసర్ అనాబెల్ బౌలింగ్‌లో రిచా డీప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటైంది. దీప్తి శర్మ (1) ఫెయిలవగా.. వేగంగా ఆడే ప్రయత్నంలో అమన్ జోత్ (16) కూడా ఔటైంది. చివరి 10 ఓవర్లలో ఇండియా 90 రన్స్ రాబట్టినా మిగిలిన వికెట్లను కోల్పోయింది.
హీలీ వదల్లే..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ స్టార్టింగ్ నుంచే ఇండియా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగింది. మరో ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌తో కలిసి దుమ్మురేపింది. పవర్ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీలీ ఖతర్నాక్ షాట్లు కొట్టింది. అమన్‌జోత్ వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లతో జోరు పెంచింది. దాంతో ఏడో ఓవర్లోనే కెప్టెన్ హర్మన్ స్పిన్నర్ స్నేహ్ రాణాను బరిలోకి దింపగా.. లిచ్‌ఫీల్డ్ ఆమెకు సిక్స్‌తో స్వాగతం పలికింది.
క్రాంతి గౌడ్ వేసిన తర్వాతి ఓవర్లో హీలీ 6, 4, 4, 4తో రెచ్చిపోయి 19 రన్స్ రాబట్టింది. అమన్‌జోత్ వేసిన పదో ఓవర్లో స్టంపౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న లిచ్‌ఫీల్డ్ నాలుగు ఫోర్లతో విజృంభించింది. అయితే,12వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఏపీ స్పిన్నర్ శ్రీచరణి తన రెండో బాల్‌కే లిచ్‌ఫీల్డ్‌ను ఔట్ చేసి 85 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేసింది. అయినా వెనక్కుతగ్గని హీలీ 35 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొని మరింత జోరందుకుంది.
తన ధాటికి 15 ఓవర్లలోనే ఆసీస్ వంద రన్స్ దాటింది. మరో ఎండ్‌లో హీలీకి మంచి సపోర్ట్ ఇచ్చిన పెర్రీ.. 24వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెత్ మూనీ (4).. దీప్తి బౌలింగ్‌లో జెమీమా పట్టిన అద్భుత క్యాచ్‌కు ఔటవగా.. వెంటనే సదర్లాండ్ (0)ను శ్రీచరణి డకౌట్ చేయడంతో ఇండియా రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, హీలీ ఆ చాన్స్ ఇవ్వలేదు.
84 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె రాణా వేసిన 31వ ఓ వర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో మళ్లీ స్పీడు పెంచింది. ఇంకోవైపు గార్డ్‌నర్ ధాటిగా ఆడటంతో 38 ఓవర్లకు 258/3తో నిలిచిన ఆసీస్ ఈజీగా గెలిచేలా కనిపించింది. ఈ దశలో హీలీని శ్రీచరణి, తాలియా (12)ను దీప్తి పెవిలియన్ చేర్చగా.. గార్డ్‌నర్‌తో పాటు మోలినుక్స్ (18)ను అమన్‌జోత్ ఔట్ చేయడంతో ఇండియా ఒక్కసారిగా రేసులోకి వచ్చింది.
చివరి నాలుగు ఓవర్లలో ఆసీస్‌కు 26 రన్స్ అవసరం చేతిలో మూడు వికెట్లే ఉన్న ఆసీస్‌పై ప్రెజర్ పెరిగింది. కానీ, ఆఖర్లో బౌలర్లు పట్టు విడిచారు. క్రాంతి వేసిన 47వ ఓవర్లో గార్త్ ( 14నాటౌట్), మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన పెర్రీ చెరో ఫోర్ కొట్టి ఒత్తిడి తగ్గించారు. స్నేహ్ వేసిన 49వ ఓవర్లో గార్త్ ఫోర్ కొట్టగా.. పెర్రీ సిక్స్‌తో మ్యాచ్ ముగించింది.
మంధాన @ 5000
మంధాన విమెన్స్ వన్డేల్లో 5000 రన్స్ క్లబ్‌లో చేరింది. కేవలం 112 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. అతి తక్కువ వయసులో, అత్యంత వేగంగా ఈ ఫీట్ చేసిన క్రికెటర్‌గా 29 ఏండ్ల మంధాన రికార్డు సృష్టించింది.
విమెన్స్ వన్డే క్రికెట్‌లో ఇదే (331) హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ ఛేజింగ్. గతేడాది సౌతాఫ్రికాపై శ్రీలంక ఛేజ్ చేసిన 302 రన్స్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. వరల్డ్ కప్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ రికార్డును కూడా అధిగమించింది. 2022లో ఇండియాపైనే ఆసీస్ 278 రన్స్‌ను ఛేజ్ చేసింది.