అనారోగ్యంతో రచయిత సిరివెన్నెల మృతి

అనారోగ్యంతో రచయిత సిరివెన్నెల మృతి

హైదరాబాద్ః  మాస్టర్ శివశంకర్ మరణించిన విషయం మరువకముందే.. మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మృతిచెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.   నవంబర్ 24న న్యూమోనియోతో ఇబ్బందిపడుతూ సిరివెన్నెల సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన  సిరివెన్నెల చిత్రంతో ఆయన ఇంటి పేరు మారింది.  సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు. సిరివెన్నెల విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. సిరివెన్నెల మొదట్లో భరణి పేరుతో కవితలు రాసేవారు. ఆయన రాసిన గంగావతరణం కవిత చూసిన తర్వాత కే. విశ్వనాథ్..  సిరివెన్నెల చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు.  సిరివెన్నెల సుమారు 3 వేలకు పైగా పాటలు రాశారు. అదేవిధంగా 165కుపైగా చిత్రాలకు పూర్తిస్థాయిలో పాటలు రాశారు. మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించారు. ఆయన తన రచనలతో 2019లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా.. తన సినీజీవితంలో 11 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. 

సిరివెన్నెల పాటలు రాసిన చిత్రాలలో.. సిరివెన్నెల, స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం, గులాబీ, మని, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీ పుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, శుభ సంకల్పం, పట్టుదల, మనసులో మాట, పవిత్ర బందం, భారతరత్న, నువ్వు వస్తావని, చక్రం, గమ్యం, మహాత్మ, కిక్, అలా ఎలా, దేవదాస్, అల వైకుంఠపురములో, రంగమార్తాండ తదితర చిత్రాలు ఎంతో ప్రేక్షాకాదరణ పొందాయి.