పేపర్ తన నుంచే లీకైందని విద్యార్థిని డిబార్ చేసిన అధికారులు

పేపర్ తన నుంచే లీకైందని విద్యార్థిని డిబార్ చేసిన అధికారులు

ఓ వైపు పదో తరగతి పశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంటే.. మరో పక్క పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని లీకేజీకి కారణం అతడే అని ఆరోపిస్తూ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపించేశారు. ఎగ్జామ్ రాస్తుండగా అధికారులు వచ్చి, డీబార్ అయ్యావని చెప్పి హాల్ టికెట్ తీసుకున్నారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో జరిగింది.

తాను పరీక్ష రాస్తుండగా వేరే సర్ తో పిలిపించి, తన హాల్ టికెట్ తీసుకుని బయటికెళ్లమని డీఈవో సర్ చెప్పారని విద్యార్థి తెలిపాడు. అప్పుడే తనను డీఈవో సర్ సంతకం చేయమన్నారని, అక్కడ అందరూ ఉండడంతో భయపడి సంతకం చేశానని చెప్పాడు. ఎందుకు సైన్ చేయించుకుంటున్నారని అడిగితే.. నీ వల్లే పేపర్ లీకైందని, వైరల్ అయిందని చెప్పినట్టు విద్యార్థి తెలియజేశాడు. తనను ఐదు సంవత్సరాలు డిబార్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 4న హిందీ ఎగ్జామ్ జరుగుతుండగా ఓ వ్యక్తి తనను పిలిచి, తన పేపర్ ఇవ్వమని బెదిరించాడని, అయినా తాను ఇవ్వలేదన్నాడు. ఆ వ్యక్తి కాసేపయ్యాక సడెనా గా వచ్చి కిటికీలోనుంచి చేయి పెట్టి తన పేపర్ గుంజుకుని, ఫొటోలు తీసుకున్నాడని తెలిపాడు. ఆ తర్వాత ఏమైందో కూడా తనకు తెలియని చెప్పాడు. అసలు ఆ వ్యక్తి అసలెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. ఈ రోజు జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయలేదని, ఇప్పటి వరకు తనకు ఎలాంటి చెడ్డ పేరు రాలేదని ఆ విద్యార్థి చెప్పాడు. జీవితంలో చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నానని, ఈ రోజు జరిగిన ఎగ్జామ్ మినహాయిస్తే.. సప్లిమెంటరీలోనైనా ఎగ్జామ్ రాస్తానని, తనపై విధించిన డిబార్ తీసేయాలని కోరాడు. తన హాల్ టికెట్ తనకు ఇవ్వాలని, మిగతా ఎగ్జామ్స్ రాసేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.

ఇప్పటి వరకూ తన కొడుకుపై ఎలాంటి రిమార్కు రాలేదని విద్యార్థి తల్లి చెప్పారు. ఒకబ్బాయి వచ్చి తన కొడుకును చంపుతా, పొడుస్తానంటూ బెదిరించాడని ఆమె తెలిపారు. ఎవరికైనా చెబితే చంపుతానన్నాడని చెప్పారు. తమక్కూడా ముందుగా చెప్పలేదని, ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయనివ్వలేదని, ఎవరో చేసిన పనికి తన కొడుకును బలిపశువును చేయొద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము తప్పు చేసే మనుషులం కాదన్న ఆమె.. తన కొడుకు బంగారు భవిష్యత్తును ఆగం చేయకండంటూ వేడుకున్నారు. తెలియక భయపడి సంతకం పెట్టాడని, హాల్ టికెట్ ఇచ్చి రేపట్నుంచి ఎగ్జామ్ కు అనుమతించండి అని ఆమె కోరారు.