- దైవదర్శనం ముగించుకొని వస్తుండగా ఘటన
- ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
మధిర, వెలుగు: దైవదర్శనం అనంతరం స్వగ్రామానికి ఆటోలో వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు శనివారం జమలాపురంలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురం, దెందుకూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాళ్లూరి భవాని(40) మృతిచెందింది.
తాళ్లూరి చంద్ర(45)తో పాటు మూడేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
