
తిరుమల: తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తుడిపై ఆటో డ్రైవర్లు దాడికి దిగిన ఘటన భక్తుల్లో భయాందోళనలకు కారణమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి భక్తులు తిరుమలకు వెళుతుంటారు. అలాంటి భక్తులపై శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టుకు వెళ్లే ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటోడ్రైవర్లు దాడికి దిగారు.
దాడికి సంబంధించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్ చెప్పిన రేటుకు భక్తుడు నిరాకరించడంతో అతడిపై తీవ్రంగా దాడి చేసి ఆటో డ్రైవర్లు గాయపరిచారు. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఆటోవాలాల దందా రోజురోజుకు పెరిగిపోతుండటం గమనార్హం.
తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి శ్రీవారి మెట్టు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది. అయితే సమాచార లోపం కారణంగా భక్తుల్లో గందరగోళం నెలకొంది. ఉచిత బస్సుల టైమింగ్ భక్తులకు తెలియకపోవడంతో శ్రీవారి మెట్టు వరకు భక్తులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఆటోవాలాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
►ALSO READ | తిరుమల శ్రీవారి ఆలయంపై నీలి మేఘాలు: అద్బుతాన్ని మైమరిచి వీక్షించిన భక్తులు
22 కిలోమీటర్ల దూరానికి వందలకు వందలు డిమాండ్ చేస్తుండడంతో మరో మార్గం లేక ఆటోవాలాలతో బేరాలు ఆడాల్సి వస్తోంది. వాళ్లు చెప్పిన రేటుకు ఓకే అంటేనే భక్తులను శ్రీవారి మెట్టు వరకు చేరుస్తున్నారు. లేదంటే.. ఇలా భక్తులను దూషిస్తూ.. ఇలా దాడులకు పాల్పడుతూ ఆటో డ్రైవర్లు ప్రవర్తిస్తున్న తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్ బయట భక్తుడిపై ఆటో డ్రైవర్ల దాడి#tirumala #Tirupathi #ViralVideos pic.twitter.com/t0LRcCEzWx
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) August 8, 2025