
రాజన్న సిరిసిల్ల: ఎక్కడైనా బస్సు సౌకర్యం కల్పించాలంటూ రోడ్లపై నిరసన తెలపడం చూశాం. కానీ ఇక్కడ మాత్రం బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. వేములవాడకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలంటూ స్థానిక ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి.. ఆటోను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దాంతో తిప్పాపూర్ బస్టాండ్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆందోళనకారులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఉచిత బస్సు సౌకర్యంతో తమకు ఆదాయం రావడంలేదని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని ఆటో డ్రైవర్లు తెలిపారు. ఆటోడ్రైవర్ల ఆందోళనతో వేములవాడలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించి.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
For More News..