ఆటోమొబైల్​ ఇండస్ట్రీకి త్వరలోనే మంచిరోజులు

ఆటోమొబైల్​ ఇండస్ట్రీకి త్వరలోనే మంచిరోజులు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ ఇండస్ట్రీకి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయి. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా 24 రోజులపాటు పండగలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అమ్మకాలు జోరందుకుంటాయని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (ఫాడా) తెలిపింది. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో ఈ నెలలో మరింత ఎక్కువగా అమ్మకాలు జరిగే అవకాశం ఉందని, ఈ పదేళ్లలో ఇదే తమకు బెస్ట్​ ఫెస్టివ్​ సీజన్​ అని డీలర్లు అంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆటోమొబైల్ రంగం మొత్తం రిటైల్ అమ్మకాలు సంవత్సరానికి 11 శాతం పెరిగాయి. తయారీదారుల నుంచి సరఫరాలు  మెరుగుపడ్డాయి. విడిభాగాల కొరత తీరిపోయింది.

పండుగ కాలంలో కస్టమర్లకు వేగంగా డెలివరీలను ఇవ్వడానికి డీలర్‌‌‌‌‌‌‌‌లకు ఓకే చెప్పాయి. ఈ విషయమై ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ, "2022 సెప్టెంబర్ నెలలో ఆటో రిటైల్ సెగ్మెంట్​ మొత్తం 11 శాతం గ్రోత్​ని సాధించింది. సెప్టెంబర్ 10-–25 నుంచి చెడ్డరోజులు ఉంటాయి కాబట్టి కొనుగోళ్ల చాలా తక్కువగా ఉంటాయి. సెప్టెంబర్ 26 న నవరాత్రితో ప్రారంభమైన పండుగ కాలం అక్టోబరు వరకు కొనసాగుతుంది. అప్పటి నుంచి అమ్మకాలు బాగుంటాయి" అని ఆయన వివరించారు. సెప్టెంబరులో ట్రాక్టర్లు మినహా మిగిలిన అన్ని కేటగిరీలు అమ్మకాలు బాగున్నాయని ఫాడా రిపోర్టు పేర్కొంది. టూవీలర్స్​, త్రీవీలర్స్​, ప్యాసింజర్ వెహికల్స్​ (పీవీ), కమర్షియల్​ వెహికల్స్​ (సీవీ) అమ్మకాలు వరుసగా 9 శాతం, 72 శాతం, 10 శాతం,  19 శాతం పెరిగాయి.  2019 సెప్టెంబర్ తో పోలిస్తే పీవీ సెగ్మెంట్ 44 శాతం గ్రోత్​తో పరుగును కొనసాగించింది.  త్రీ వీలర్​, ట్రాక్టర్,  సీవీలలో గ్రోత్​ వరుసగా 6 శాతం, 37 శాతం  17 శాతం పెరిగింది.  టూవీలర్​ సెగ్మెంట్ మాత్రమే 14 శాతం పడిపోయింది.