AAIB ఫైనల్ రిపోర్ట్ తర్వాతే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై క్లారిటీ: రామ్మోహన్ నాయుడు

AAIB ఫైనల్ రిపోర్ట్ తర్వాతే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై క్లారిటీ: రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: ఏఏఐబీ ఫైనల్ రిపోర్ట్ తర్వాతే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణమేంటన్నది తెలుస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 2025, జూలై 21 వర్షకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్య సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. 

ALSO READ | రన్వే పై ల్యాండ్ అవుతూ పక్కకు జారి పోయిన విమానం.. ముంబై ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం

2025, జూన్ 12న అహ్మదాబాద్‎లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ నుంచి డేటాను ఏఏఐబీ విజయవంతంగా చేసిందని తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో ఏఏఐబీ పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ విషయంలో తాము సత్యం వైపు నిలబడతామని స్పష్టం చేశారు రామోహ్మన్ నాయుడు. ఏఏఐబీ తుది దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై ఒక క్లారిటీ ఇస్తుందని చెప్పారు. ఏఏఐబీ ప్రాథమిక రిపోర్టు ఆధారంగా అప్పుడు ఒక నిర్ణయానికి రావొద్దని సూచించారు. 

కాగా,2025, జూన్ 12న మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా ఏఐ171 బోయింగ్ డ్రీమ్​లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సమీపంలోని మెడికల్ కాలేజీ భవనాలపై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక ప్యాసింజర్ మినహా మిగిలిన వారంతా మృతిచెందారు. మెడికల్ కాలేజీలో ఉన్న డాక్టర్లు, ఇతర స్టాఫ్ మరో 19 మంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

ఈ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ ఈ మేరకు 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్​లైనర్ విమాన ప్రమాదానికి రెండు ఇంజన్లూ సడెన్‎గా ఫెయిల్​ కావడమే కారణమని ప్రాథమిక నివేదికలో తేల్చింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక్క సెకను తేడాలోనే ఫ్యూయెల్ స్విచ్‎లు రన్ మోడ్ నుంచి కటాఫ్ పొజిషన్‎లోకి వెళ్లాయని, దీంతో ఫ్యూయెల్ అందక రెండు ఇంజన్లూ ఒకేసారి ఫెయిల్ అయి.. ప్రమాదానికి దారితీసినట్టు తెలిపింది.