పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి.. ఎలాంటప్పుడు తీసుకోకూడదో తెలుసా..? నిపుణుల హెచ్చరిక

పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి.. ఎలాంటప్పుడు తీసుకోకూడదో తెలుసా..? నిపుణుల హెచ్చరిక

ఈ రోజుల్లో బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్స్ పొందటం సులభంగా మారిపోయింది. దీంతో ఉద్యోగులు కూడా తక్షణ రుణం పొందగలుగుతున్నారు. డబ్బు నేరుగా వారి ఖాతాలో జమ అవుతోంది. అయితే ఆర్థిక నిపుణుల హెచ్చరిక ప్రకారం వ్యక్తిగత రుణాలు ఖరీదైనవిగా పరిగణించబడుతున్నాయ్. ఇవి అధిక వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ప్రీ పేమెంట్ జరిమానాలు వంటి భారం కూడా కలిగిస్తాయి.

ప్రజలు పర్సనల్ లోన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలని ఆర్థిక సలహాదారులు, నిపుణులు చెబుతున్నారు. అత్యవసర వైద్య అత్యవసరాలు, ఇంటి మరమ్మతులు లేదా ఆకస్మిక ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే పర్సనల్ లోన్‌కి వెళ్లటం సరైన నిర్ణయం. EMIలు చెల్లించే స్థోమత ఉన్నప్పుడు మాత్రమే రుణం తీసుకోవటం కరెక్ట్ నిర్ణయం.

కానీ లగ్జర లైఫ్ స్టైల్ ఖర్చులు, గాడ్జెట్స్ కొనుగోలు, టూర్స్ వెళ్లటానికి లేదా పెళ్లి కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం ఆర్థిక నిపుణులు తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నారు. అలాగే క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారు రుణం తీసుకుంటే అధిక వడ్డీ రేటు భారం మోసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల కోసం రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని మరీమరీ హెచ్చరిస్తున్నారు.

ALSO READ : ఆధార్ అప్ డేట్ ఫీజులు భారీగా పెరిగాయి

నిపుణుల సూచన ప్రకారం ప్రజలు ఎమర్జెన్సీ ఫండ్ కలిగి ఉండటం ఉత్తమ పద్ధతి. అలాంటి నిధి ఉంటే సంక్షోభ సమయంలో రుణం అవసరం ఉండదు. అలాగే రుణం తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోరు 720 పైబడితే తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైగా బ్యాంకులు లోన్స్ అందించే సమయంలో సాధారణంగా రుణ మొత్తం నుంచి 1% నుంచి 3% వరకు ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తాయి. ఈ మెుత్తం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. EMIలు మీ జీతంలో 50% దాటితే కొత్త రుణం పొందడం కష్టమవుతుందని గుర్తుంచుకోండి. 

మొత్తానికి పర్సనల్ లోన్స్ ఉపయోగకరమైనవే అయినప్పటికీ.. అదుపు తప్పితే పెద్ద భారంగా మారే ప్రమాదం కలిగి ఉంటాయి. అందుకే రుణ ఒప్పందంలోని ప్రతి షరతును జాగ్రత్తగా చదవడం, అవసరమైనప్పుడు మాత్రమే ఈ రుణాన్ని పొందటం మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. అనవసరమైన లగ్జరీ లేదా ఆడంబరాలకు పోయి చేసే ఖర్చుల కోసం లోన్స్ తీసుకుంటే ఆర్థికంగా జీవితాలు భారంగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా నేటి కాలంలో చాలా మంది చేస్తున్న పెద్ద తప్పే అనవసరమైన వాటి కోసం లోన్స్ తీసుకోవటం అందుకే పైన విషయాలను గమనించి ముందుకెళ్లాలి.