
- 7 ఏళ్ల వనవాసం.. 11 వికెట్ల అద్భుతం
- తొలి వన్డే, టెస్ట్‌కు మధ్య ఏడేళ్ల గ్యాప్
- పింక్ టెస్ట్‌లో 11 వికెట్లతో రికార్డు
- టీమిండియా నయా వెపన్ అక్షర్
జూన్ 15, 2014.. వన్డేల్లోకి అరంగేట్రం, ఫిబ్రవరి 13, 2021.. టెస్ట్‌ల్లోకి డెబ్యూ..! ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏడేళ్లు..! ఈ గ్యాప్‌లో అడపాదడపా లిమిటెడ్ ఓవర్స్ టీమ్‌లోకి వచ్చిపోతూనే ఉన్నాడు..! కానీ అద్భుతం చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు..! టీమ్ కోసం పోరాడే క్షణం ఏనాడూ రాలేదు..! సీన్ కట్ చేస్తే… ఏడేళ్ల వనవాసం ముగిసింది..! రవీంద్ర జడేజా లేకపోవడంతో ఓ చాన్స్ వచ్చింది..! అంతే.. నడియాడ్ జయసూర్య నుంచి మొతెరా నయా హీరోగా మారిపోయాడు.. మన అక్షర్ పటేల్..! స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాడు..! ఫాస్ట్ బౌలర్‌గా ప్రయత్నించాడు..! స్పిన్నర్‌గా స్థిరపడ్డాడు..! ఇప్పుడు స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు ప్రాణదాతగా మారిపోయాడు..! సింగిల్ నైట్‌లో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయిన అక్షర్ ఆట వెనుక ఉన్న మర్మమేంటో తెలుసుకుందాం..!!
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: చాలా మంది క్రికెట్ ఆడతారు. కానీ కొద్ది మంది మాత్రమే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈ రెండో కోవకు చెందిన వాడే అక్షర్ పటేల్. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో ఆడాలంటే కాంపిటీషన్‌ను తట్టుకోవాలి. అదే టెస్ట్ ఫార్మాట్‌లో రాణించాలంటే టాలెంట్, స్కిల్స్ ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉన్న స్పిన్నర్‌గా అక్షర్.. టీమిండియా తరఫున నయా వెపన్‌గా మారిపోయాడు. చెన్నైలో తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీనికి ప్రధాన కారణం.. లోయర్ ఆర్డర్‌లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం. చాలా రోజులుగా ఈ బరువును మోస్తున్న రవీంద్ర జడేజా.. గాయంతో సిరీస్‌కు దూరం కావడం అక్షర్ పటేల్‌కు వరంలా మారింది.
ఫస్ట్ టెస్ట్‌లోనే.. అదుర్స్
2018లో సౌతాఫ్రికాతో లాస్ట్ వైట్‌బాల్ మ్యాచ్ ఆడిన అక్షర్ పటేల్ ఆ తర్వాత గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. లిమిటెడ్ ఓవర్స్ సిరీస్‌లో బాగా ఆడుతున్నా.. టీమ్‌లోకి అలా వచ్చిపోయే వాడే తప్ప.. స్థిరంగా నిలబడ్డ సందర్భాల్లేవు. కానీ క్లిష్ట పరిస్థితుల మధ్య చెన్నైలో జరిగిన సెకండ్ టెస్ట్‌లో అరంగేట్రం చేయడం అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. మంచి టర్నింగ్, ఎక్కువ ఫ్లైట్, స్ట్రెయిట్ బాల్స్, డిఫరెంట్ వేరియేషన్స్‌తో బాగా ఆకట్టుకున్నాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు తీసి తర్వాతి మ్యాచ్‌కు లైన్ క్లియర్ చేసుకున్నాడు. ‘మూడేళ్లు బ్రేక్ రావడంతో నా ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టా. అదే టైమ్‌లో బాగా ఆడుతున్నా.. టీమ్‌లో ఎందుకు లేవని చాలా మంది ప్రశ్నించేవారు. ఇలా ప్రతి రోజు ఇవే గుర్తుకు వస్తుండటంతో సరైన టైమ్ కోసం వేచి చూడాలని సర్ది చెప్పుకునేవాడ్ని. ఇప్పుడు నా టైమొచ్చింది’ అని పటేల్ పేర్కొన్నాడు.
ఆర్మ్ బాల్సే ఆయుధాలు..
స్పిన్నర్లు ఎక్కువగా బాల్‌ను ఫింగర్స్‌తో టర్న్ చేస్తారు. వేరియేషన్ కోసం ఫ్లైట్‌లో తేడా చూపిస్తూ టర్నింగ్ రాబడతారు. కానీ అక్షర్ పటేల్ ఈ రెండింటితో పాటు ఆర్మ్ బాల్స్‌ను అద్భుతంగా ప్రయోగిస్తాడు. పెద్దగా టర్న్ లేకుండా బాల్‌ను స్ట్రెయిట్‌గా వికెట్లపైకి సంధిస్తాడు. బాల్ టర్న్ అవుతుందనే భ్రమలో బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టిస్తాడు. మామూలు స్పిన్నర్లకు ఇది సాధ్యం కాదు. ఎందుకంటే బాల్ ఎక్కువగా స్పిన్ అయితే స్పీడ్ తక్కువగా ఉంటుంది. అయితే కెరీర్ ఆరంభంలో అక్షర్ ఫాస్ట్ బౌలర్ కావడంతో ఆర్మ్ బాల్‌ను చాలా స్పీడ్‌గా వేస్తాడు. మొతెరా మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తీసిన ఆరు వికెట్లలో నాలుగు స్ట్రెయిట్ బాల్స్‌కే పడటం ఇందుకు నిదర్శనం. క్రాలీ, బెయిర్‌స్టో , ఆర్చర్, ఫోక్స్ లైన్ మిస్ అయి వికెట్ల ముందు దొరికిపోయారు. మొతెరా సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ ఐదు వికెట్ల హాల్‌తో చెలరేగాడు.
వెంకటపతి రాజు తీర్చిదిద్దాడు..
ఆర్మ్ బాల్స్ వేయడంలో పరిపూర్ణత సాధించడం వెనుక టీమిండియా మాజీ స్పిన్నర్, హైదరాబాదీ వెంకటపతి రాజు ఉన్నాడని అక్షర్ చెప్పాడు. అతనితో కలిసి పని చేయడం వల్ల పర్ఫెక్ట్ బాల్స్ ఎలా వేయాలో నేర్చుకున్నానన్నాడు. ‘ఆర్మ్ బాల్‌ను ఎలా వేయాలో నేనే నేర్చుకున్నా. కానీ ఎన్‌సీఏలో వెంకట్ సర్ దగ్గర శిక్షణ తీసుకున్నాక మరింత పరిపూర్ణత వచ్చింది. ఇలాంటి బాల్స్ వేయడంలో రాజు సర్ మాస్టర్. కెరీర్ బిగెనింగ్‌లో నేను ఫాస్ట్ బౌలర్‌ను కావడం వల్ల బాల్ కాస్త వేగంగా పడుతుంది. అయితే మోకాళ్ల నొప్పుల కారణంగా నేను స్పిన్నర్‌గా మారాల్సి వచ్చింది. అప్పుడు చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు నాకు పనికొస్తున్నది’ అని ఈ గుజరాతీ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీసి ఫస్ట్ చాయిస్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో అక్షర్ ప్లేస్ సుస్థిరం చేసుకున్నాడు. ఇకపై కూడా ఇదే పెర్ఫామెన్స్ చూపిస్తే మాత్రం ఫ్యూచర్‌లో అక్షర్ ఎవరెస్ట్ స్థాయిలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
నడియాడ్ జయసూర్య
గుజరాత్‌లోని ఆనంద్, ఖేడా జిల్లాల మధ్య ఉన్న నడియాడ్‌లో అక్షర్ పుట్టాడు. నానా కుంభ్‌నాథ్ రోడ్‌లో క్రికెట్‌లో అడుగులు వేశాడు. చిన్నతనంలో లెఫ్టార్మ్ ఆల్‌రౌండర్‌గా క్రికెట్ ఆడేవాడు. అయితే అక్షర్ యాక్షన్ మొత్తం శ్రీలంక లెజెండ్ జయసూర్యను పోలి ఉండటంతో లోకల్ ఫ్యాన్స్, ప్లేయర్లు జయసూర్య అనే పిలిచేవారు. సేమ్ జయసూర్యలాగే లెఫ్టార్మ్ బౌలింగ్, ఫించ్ హిట్టింగ్‌తో బ్యాటింగ్‌లో అదరగొట్టేవాడు. ఇలా చిన్నతనంలోనే ఆటలో మంచి ప్రావీణ్యం చూపెట్టడంతో.. భవిష్యత్‌లో మంచి క్రికెటర్ అవుతాడని భావించిన అతని తండ్రి రాజేశ్ పటేల్ క్యాంప్‌లో జాయిన్ చేశాడు. ఇతర పిల్లల మాదిరిగా టైమ్ వేస్ట్ చేయకుండా ఫిట్‌నెస్‌తో ఉంటాడనే మరో ఉద్దేశం కూడా ఇందులో ఉందని రాజేశ్ వెల్లడించాడు. ‘అక్షర్ క్యాంప్‌లో జాయిన్ అయినప్పుడు నేను కోచ్‌తో ఒకటే మాట చెప్పా. గేమ్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. బాగా అలసిపోయి ఇంటికి వచ్చేలా చూడండని చెప్పా. కానీ ఆరు నెలలు తిరగకముందే అక్షర్ స్కూల్ టీమ్‌ను లీడ్ చేసే స్థాయికి ఎదిగాడు. ఆ వెంటనే అండర్–16 టీమ్‌లో చోటు సంపాదించాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు’ అని రాజేశ్ పేర్కొన్నాడు. 2014లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అక్షర్.. యావరేజ్ పెర్ఫామెన్స్‌తో ప్లేస్ కోల్పోయాడు. కానీ, పట్టుదలతో శ్రమించి మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు టెస్టుల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు.