మద్యం తాగొద్దని మందలించిన భార్య.. భర్త ఆత్మహత్య..

మద్యం తాగొద్దని మందలించిన భార్య.. భర్త ఆత్మహత్య..

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. మద్యం తాగొద్దని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ( సెప్టెంబర్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలానికి చెందిన వడ్డే సంతోష్, శృతికి గత ఏడు నెలల క్రితం వివాహమయ్యింది. జీవనోపాధి కోసం వారు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో స్థిర పడ్డారు. సంతోష్ కొద్ది రోజులుగా మద్యాన్ని సేవిస్తున్న క్రమంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి..

ఈ క్రమంలో శనివారం రాత్రి సంతోష్ మద్యం సేవించి ఇంటికి రాగా.. భార్య శృతి మద్యం తాగొద్దని గట్టిగా మందలించింది. దీంతో రాత్రంతా వారిద్దరికి వాగ్వాదం జరిగింది. మరుసటి ఉదయం తెల్లవారుజామున సంతోష్ ని నిద్రలేపుదామని గది తలుపులు తట్టగా, ఎలాంటి స్పందన లేదు.. ఇరుగుపొరుగువారు, పోలీసుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి వెళ్ళి చూడగా, సంతోష్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని వేల్లాడుతూ కనిపించాడు.

భార్య శృతి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.