
మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో తొక్కిసలాట చోటు చేసుకుందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచింది టీటీడీ. సోషల్ మీడియాలో తొక్కిసలాట జరిగిందంటూ తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతోందని.. ఈ వార్తల్లో అసత్యమని, కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి తొక్కిసలాట జరగలేదని స్పష్టం చేసింది టీటీడీ. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది టీటీడీ.
టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది టీటీడీ. మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారని.. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆలయం ఆవరణలో పెద్దలకు తర్పణాలు వదిలినట్లు తెలిపింది టీటీడీ.
భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పోలీస్ శాఖ ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసిందని... ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపింది టీటీడీ.
ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని.. జిల్లా ఎస్పీ స్వయంగా ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో అధికారులు, సిబ్బందికి సూచనలు ఇస్తూ ఏర్పాట్లను పరిశీలించారు ఎస్పీ సుబ్బారాయుడు.