ఉగ్రవాదితో పోరాటంలో శునకం వీరమరణం

ఉగ్రవాదితో పోరాటంలో శునకం వీరమరణం

దేశాన్ని కాపాడేందుకు ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటు వివిధ బలగాలు నిత్యం పహారా కాస్తుంటాయి. రాజస్థాన్ ఎడారి నుంచి సియాచిన్ కొండల దాకా.. అన్ని చోట్లా బలగాలు మోహరించి ఉంటాయి. దేశ భద్రతలో ఆర్మీ జవాన్లతో పాటుగా శునకాలు పాలు పంచుకుంటున్నాయి. దేశంకోసం నిరంతరం సేవ చేస్తుంటాయి. జవాన్లు డ్యూటీ చేసే కఠోర వాతావరణ పరిస్థితుల్లో ఈ శునకాలు కూడా విధులు నిర్వర్తిస్తున్నాయి. నిందితులను పట్టుకుంటాయి. పారిపోయిన నేరస్తుల ఆచూకీ పట్టేస్తాయి. భూమి లోపలున్న మందుపాతరలను గుర్తిస్తాయి. పేలుడు పదార్థాలను  పసిగట్టి బలగాలకు సిగ్నల్ ఇస్తాయి. మంచుకొండల్లో సైతం కనురెప్పవేయకుండా డ్యూటీ చేస్తాయి. అంతేకాదు దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు వెనకాడవు. 

కాశ్మీర్ బారాముల్లాలోని వాణిగావ్ బాలాలో  రెండు మూడు రోజుల క్రితం  ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులున్నారన్న సమాచారంలో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులో ఓ మసీదు లోపల దాక్కుని బలగాలపై కాల్పులు జరుపుతున్నాయి.  ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్లు లొంగిపోలేదు. అలాగని బలగాలు మసీదులోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే లోపల వారు ఎక్కడ నక్కి ఉన్నారో తెలియదు. ఏదీ తెలియకుండా లోపలికి వెళితే బాంబులతో ఈ ప్రాంతాన్ని పేల్చేయొచ్చు.  అదే జరిగితే  జవాన్ల ప్రాణాలు పోతాయి.  పవిత్రమైన మసీదు కూలిపోతుంది. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న  ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.  

ఉగ్రవాది బుల్లెట్లకు అసువులు బాసింది..
ఇలాంటి క్లిష్ట పరిస్థితులో  యాక్సెల్, బజాజ్ అనే  ఇద్దరు సైనికులు రంగంలోకి దిగారు. అయితే వీళ్లు మనుషులు కాదు.  ఆర్మీ  ట్రైనింగ్ తీసుకున్న శునకాలు. ఈ రెండింటికి కెమెరాలు పెట్టారు. మొదట బజాబ్ లోపలికి వెళ్లింది. మొదటి రూంను క్లియర్ చేసింది. తర్వాత యాక్సెల్ ను లోపలికి పంపారు. మొదటి గది క్లియర్ కావడంతో.. అది రెండో గది వైపు అడుగులు వేసింది. యాక్సెల్ రాకను గమనించిన ఉగ్రవాది.. ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఉగ్రవాది బుల్లెట్లకు యాక్సెల్ అసువులు బాసింది. బుల్లెట్ గాయాలతో అక్కడే ప్రాణాలు కోల్పోయింది. యాక్సెల్ చనిపోవడం చూసి సైనికులు కన్నీరు పెట్టారు. తమ తోటి జవాన్ ప్రాణాలు కోల్పోయినంతగా వారు దు:ఖంలో మునిగిపోయారు.

 

దేహాన్ని చీల్చినా వెనకడుగు వేయలే..
రెండేళ్ల వయస్సున్న యాక్సెల్.. ఆర్మీ 26 డాగ్ యూనిట్కు ఎటాచ్డ్గా పని చేస్తోంది.  అయితే చనిపోయే ముందు కూడా తన డ్యూటీని పర్ ఫెక్ట్గా చేసింది. మసీదులో ఉగ్రవాది ఎక్కడ దాగున్నాడో బలగాలకు తెలియజేసింది. అప్పటికే ఉగ్రవాది తుపాకి నుంచి వచ్చిన తూటాలను తన దేహాన్ని చీల్చినా వెనకడుగు వేయలేదు. ఉగ్రవాదిపై దూకి తీవ్రంగా గాయపర్చింది. వెంటనే లోపలికి వెళ్లిన సైనికులు ఉగ్రవాదిని కాల్చి చంపారు. అప్పటికే యాక్సెల్ కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మసీదుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా... చిన్న డ్యామేజీ కూడా లేకుండా సైనికులు ఆపరేషన్ కంప్లీట్ చేశారు.  యాక్సెల్ వల్లే తాము సక్సెస్ ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేశామని ఆర్మీ అధికారులు చెప్పారు.  

సైనిక లాంఛనాలతో..
డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన యాక్సెల్కు ఆర్మీ అధికారులు నివాళులర్పించారు . బారాముల్లాలో.. నార్తర్న్ కమాండ్ కు చెందిన మేజర్ జనరల్ ర్యాంక్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు యాక్సెల్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. యాక్సెల్ సేవలను కొనియాడారు.  ఆ తర్వాత విధుల్లో అమరుడైన జవాన్లకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టుగానే.. యాక్సెల్ కు అంత్యక్రియలు చేశారు. శవపేటికలో పెట్టి.. దానికి మేజర్ జనరల్ స్లేరియా, కౌంటర్ ఇన్‌సర్జెన్సీ జనరల్ ఆఫీసర్, జమ్ము-కశ్మీర్ పోలీస్ ప్రతినిధులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. 26 డాగ్ యూనిట్ లోనే దాని అంత్యక్రియలు పూర్తయ్యాయి. అక్కడే దాన్ని ఖననం చేశారు.

పోరాట యోధుడు యాక్సెల్..
యాక్సెల్ మామూలు శునకం కాదు. దాని వయసు రెండేళ్లే అయినా... శత్రువుతో ఎలా పోరాడాలో  తెలుసు. శత్రువు ఎంత బలవంతుడైనా వాడిని కూల్చే టెక్నిక్స్ నేర్చుకుంది. శత్రువు చేతిలో తుపాకీ ఉన్నా.. భయపడకుండా..దాన్ని లాగి పడేసి దాడి చేస్తుంది. శత్రువుకు ఊపిరిసలపకుండా చేస్తుంది. యాక్సెల్ చాలా ఆపరేషన్స్ లో చురుగ్గా పాల్గొంది. ఉగ్రవాదుల ఆచూకీ కనిపెట్టింది. పేలుడు పదార్థాలను గుర్తించి జవాన్ల ప్రాణాలు కాపాడింది. 

ఆర్మీ ఆపరేషన్స్లో శునకాలది కీలక పాత్ర..
మేధస్సు, దూకుడు, చురుకుదనం, ఎనర్జీ ఉండే లాబ్రడార్స్, జెర్మన్ షెపర్డ్స్ జాతి శునకాల్ని చాలా దేశాలు తమ ఆర్మీ యూనిట్లలో వాడుతుంటాయి. మన దేశంలోనూ చాలా కాలంగా శునకాలను ఆపరేషన్స్లో వాడుతున్నారు. గతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో సీఆర్పీఎఫ్ బలగాలు శునకాలను వాడాయి. ఇప్పటికీ వాడుతున్నాయి. అలాగే.. బాంబ్ స్క్వాడ్లోనూ శునకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శునకాల పరితీరు చూసి వీటిని సరిహద్దు భద్రతలోనూ వినియోగిస్తున్నారు.  సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంలో శునకాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దు దాటి దేశంలోకి వస్తున్న వారిని పట్టేస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు చాలామంది ఉగ్రవాదుల కదలికలను గుర్తించాయి.  2015లో మాన్సి అనే నాలుగేళ్ల లాబ్రడార్, హ్యాండ్లర్ బషీర్ అహ్మద్ ఉగ్రచొరబాట్లను గుర్తించే పనిలో ఉండగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మాన్సితో పాటు హ్యాండ్లర్ ప్రాణాలు పోయాయి. వీరత్వానికి మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్ అనే పురస్కారం ఇచ్చారు. మరణానంతరం పురస్కారం అందుకున్న మొదటి ఆర్మీ శునకం మాన్సినే.

సరిహద్దుల్లో సైనికులకు దారి చూపిస్తాయి..
హిమాలయ పర్వతాల్లో పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో నిరంతరం పహారా కాసే సైనికులకు శునకాలే దారి చూపిస్తాయి. సియాచిన్ గ్లేసియర్ లోనూ శునకాలే సైనికులను ముందు నడిపిస్తాయి. చుట్టూ భారీగా పేరుకుపోయిన మంచు... అడుగు తీసి అడుగేస్తే ఏముందో తెలియదు. ఎక్కడ శత్రువు నక్కి ఉన్నాడో కూడా గుర్తించలేని పరిస్థితి. అందుకే సైనికులకు ముందుగా నడుస్తూ.. అక్కడేమైనా ప్రమాదకర పరిస్థితులుంటే వెంటనే అలర్ట్ చేస్తాయి. అంతేకాదు.. ఏదైనా ప్రమాదం జరిగి సైనికులు మంచులో కూరుకుపోతే.. చాలా అడుగుల లోతులో ఉన్నా వారి ఆచూకీ గుర్తిస్తాయి.  కేవలం గస్తీలోనే కాదు.. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, భవనాలు కూలినప్పుడు అందులో చిక్కుకున్న వారిని గుర్తించడంలో వీటి సేవలకే కీలకం. కొద్ది రోజుల క్రితం అమర్ నాథ్ లో భారీ వర్షం కురిసి వరద పోటెత్తింది. దీంతో కొందరు చనిపోగా పదుల సంఖ్యలో భక్తులు గల్లంతయ్యారు. వారిని గుర్తించడంలో ఆర్మీ శునకాలు కీలకంగా పనిచేశాయి. 10 మందిని జాడను పసిగట్టడంతో ఆర్మీ అధికారులు వెంటనే ఆయా ప్రాంతాల్లో శిథిలాలు తొలగించి వారిని కాపాడారు. 

శునకాలకు ప్రత్యేక శిక్షణ..
జవాన్లతో పాటుగా అన్ని వాతావరణాల్లో శునకాలు పనిచేసేందుకు.. ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ లో ఓ సైనికుడి దినచర్య ఎలా ఉంటుందో.. ఈ శునకాల దినచర్య కూడా అలాగే ఉంటుంది. పరుగెత్తడం, శత్రువుపై దాడి చేయడం, శత్రువు చేతిలో ఆయుధాలుంటే లాగేసుకోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. అలాగే.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేలా, పేలుడు పదార్థాల ఆచూకి కనిపెట్టేలా వీటికి ప్రత్యేక శిక్షణ  ఉంటుంది. వీటి వెంట ఎప్పుడూ ఓ హ్యాండ్లర్ ఉంటారు. వీటి యోగక్షేమాలు, డ్యూటీ అంతా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ల సూచనలను ఫాలో అవుతూ ఆపరేషన్ సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేస్తాయి. 

దేశ భద్రతలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి  కాబట్టే.. శునకాలకు ఆర్మీ భారీగా ఖర్చు పెడుతోంది. 2018-19 వీటికోసం దాదాపు కోటి 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దేశంలో25కు పైగా ఆర్మీ డాగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆర్మీలో ట్రైనింగ్ తీసుకున్న డాగ్స్ కి పోలీసు శాఖలోనూ మంచి డిమాండ్ ఉంది. ల్యాండ్ మైన్స్ ని గుర్తించేందుకు చాలా రాష్ట్రాల పోలీసు శాఖలు.. ఆర్మీ నుంచి ట్రైన్డ్ డాగ్స్ని తీసుకుంటున్నాయి. గతంలో ఢిల్లీ పోలీసులు దాదాపు 100 శునకాలను ఆర్మీ నుంచి తీసుకున్నారు.