
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభానికి టైం దగ్గరకు వచ్చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువుల్ని సిద్ధం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది. భారీ గంటలను తమిళనాడులో సిద్ధం చేయిస్తుండగా.. రామాలయానికి వినియోగించే ద్వారాలు హైదరాబాద్ లోని న్యూ బోయిన్ పల్లిలో సిద్ధం చేయిస్తున్నారు. గత ఏడాది జూన్ లో మొదలైన తలుపులు తయారీ పని ఇప్పుడు పూర్తి కావొస్తోంది.
న్యూబోయిన్ పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపోలో రూపొందిస్తున్న ఈ తలుపుల తయారీ కోసం తమిళనాడుకు చెందిన కుమారస్వామి.. రమేశ్ తో పాటు మొత్తం 60 మంది దీని కోసం పని చేస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతోన్న ఈ టీం.. ఈ తలుపులకు వినియోగించే చెక్కను బలార్షా టేకును ఉపయోగిస్తున్నారు. బంగారు పూతతో కూడిన 18 ప్రదాన ద్వారాల తలుపులతో పాటు మరో 100 తలుపుల్ని తయారు చేశారు.
Ayodhya Ram temple doors made in #Hyderabad
— Sudhakar Udumula (@sudhakarudumula) December 26, 2023
They are being made at Anuradha Timbers International in New Boinpally, #Secunderabad
Sarath Babu, the owner of the company said they are making over 100 doors required for the Ram Temple in Ayodhya.
The inauguration of the… pic.twitter.com/sYhqxXhHce
అయోధ్యలోని రామ మందిర ప్రాంగణానికి అవసరమైన తలుపు తయారీలో నాణ్యమైన కలపను వినియోగిస్తున్నట్లుగా టింబర్ డిపో యజమాని చెబుతున్నారు. పనులు దాదాపు పూర్తి అయ్యాయని.. తమ శిల్పకళ బాగుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమను అభినందించినట్లుగా పేర్కొన్నారు. అయోధ్య రామమందిర తలుపుల్ని తయారు చేసే అవకాశం తమకు దక్కటం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు. తలుపుల్ని తయారు చేసే టెండర్ల కోసం దేశంలోని పేరున్న ఎన్నో కంపెనీలు పోటీ పడిన విషయాన్ని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు తెలిపారు. తలుపుల టెండర్ కోసం ఎల్ అండ్ టీ, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు పోటీ పడ్డాయని.. 2022వ సంవత్సరంలో ఇంటర్వ్యూలకు తమను పిలిచారని తెలిపారు.తమకు యాదాద్రి తో పాటు పలు దేవాలయాలకు పని చేసిన అనుభవం ఉండటంతో తమకు అవకాశం దక్కినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా అయోధ్య రామాలయ తలుపులు హైదరాబాద్ నుంచి వెళుతుండటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.
అయోధ్య రామాలయం తలుపుల తయారీ తుదిదశకు చేరుకున్నాయని, త్వరలోనే అయోధ్యకు తరలిస్తామని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్స్ యజమాని శరత్ బాబు తెలిపారు. తలుపుల తయారీ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమను సంప్రదించిందని, దీన్ని తమ పూర్వజన్మఫలంగా భావిస్తోన్నామని అన్నారు. తలుపుల తయారీ కోసం మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన నాణ్యమైన టేకును వినియోగిస్తోన్నామని శరత్ బాబు చెప్పారు. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను తలపులపై చిత్రీకరిస్తోన్నామని, రామాలయ ప్రారంభోత్సవం దగ్గర పడుతుండటంలో మూడు షిఫ్టుల్లో వాటిని రూపొందిస్తోన్నట్లు తెలిపారు.