
అయోధ్య: ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభంలో భాగంగా గత నెల 5న భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. తాజాగా రామాలయ డిజైన్ లేఅవుట్ కు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ (ఏడీఏ) పచ్చజెండా ఊపింది. అధికారులతో మీటింగ్ నిర్వహించిన అనంతరం లేఅవుట్ ను ఆమోదించిన విషయాన్ని ఏడీఏ తెలిపింది. లేఅవుట్ మొత్తం ఏరియా 2.74 లక్షల స్క్వేర్ మీటర్లు లేదా 67 ఎకరాలుగా చెప్పొచ్చు. దీంట్లో ఆలయ విస్తీర్ణం 12,879 స్క్వేర్ మీటర్ ఏరియాగా ఉంది. ఇది దాదాపు 3 ఎకరాలకు మించి ఉంటుంది. 76వ ఏడీఏ సమావేశంలో 67 ఎకరాల లేఅవుట్ కు సంబంధించిన అనుమతులకు ఆమోదముద్ర పడింది. ఈ 67 ఎకరాలకు గాను డెవలప్ మెంట్ చార్జీ కింద రూ.2,11,33,184ను ఆలయ ట్రస్టు డిపాజిట్ చేసింది. మరో రూ.15,00,363 లేబర్ సెస్ కింద త్వరలో జమ చేయనుందని ఏడీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నీరజ్ శుక్లా తెలిపారు. డెవలప్ మెంట్ ఫీజుగా రూ.1.79 కోట్లు, బిల్డింగ్ పర్మిట్ ఫీజుగా రూ.64 వేలు, డెవలప్ మెంట్ లైసెన్స్ కింద రూ. 1.50 లక్షలు, సూపర్ విజన్ ఫీజుగా రూ.29.73 లక్షలు, మ్యాప్ కు రూ.65 వేలు దీంట్లోనే భాగమన్నారు.