అయోధ్య రాముడి తొలి దర్శనం మోదీకే

అయోధ్య రాముడి తొలి దర్శనం మోదీకే

అయోధ్యలో అపూర్వ ఘట్టం అవిష్కృతమైంది.  బాలరాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో  వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రాముడి విగ్రహాన్ని  తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి తొలి హారతిని  ఇచ్చారు.  84 సెకన్ల పాటు జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో బాలరాముడి దివ్యమనోహర రూపం చూపుతిప్పుకోని విధంగా ఉంది. స్వర్ణాభరణాలు, ఎడమచేతిలో విల్లు, కుడిచేతిల బాణంతో అయోధ్య బాలరాముడి దర్శనంతో భక్త జనం పులకించింది.  ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దాదాపు 2 గంటల పాటు మంగళ ధ్వనులు ప్రతిధ్వనించాయి.

అంతకుముందు  రాముడి కోసం ఛత్రం, పట్టువస్త్రాలను మోదీ తీసుకొచ్చారు.   రంగమండపంలోకి ప్రవేశించన తరువాత వాటిని  అక్కడ పండితులకు అందజేశారు. మోదీ పక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , యూపీ గవర్నర్‌ ఆనందిబెన్, సీఎం యోగి కూడా ఉన్నారు.  కాగా రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా వీఐపీలు, వీవీఐపీలు అయోధ్యకు తరలివచ్చారు.  అయోధ్య నగరాన్ని దాదాపుగా 2,500 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. రేపటి (జనవరి 23)నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు.