అరుణ్ చెక్కిన రామ్​లల్లా సుందర రూపం

అరుణ్ చెక్కిన రామ్​లల్లా సుందర రూపం

అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న రామ్​లల్లా సుందర రూపం ఎలా ఉంటుంది? అసలు బాలరాముడు ఎలా ఉంటాడో చూడాలని ఉత్సాహపడేవాళ్లు కోకొల్లలు. యావద్భారతంతో పాటు ప్రపంచంలోని కొన్ని లక్షల మంది చూపు అయోధ్య రామమందిరం మీదనే ఉంది ఇప్పుడు. ఇన్ని కళ్లు ఎదురుచూస్తున్న ఆ బాలరాముడి విగ్రహాన్ని తన చేతులతో మలిచిన శిల్పి కర్నాటకలోని మైసూరుకి చెందిన అరుణ్​ యోగిరాజ్​. ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్న అరుణ్...​ కెరీర్​గా శిల్ప కళను ఎందుకు ఎంచుకున్నాడు? 

అరుణ్​ యోగిరాజ్​కుటుంబం ఐదు తరాలుగా శిల్పులుగా ఉన్నారు. చిన్నప్పట్నించీ అరుణ్​ శిల్పాలు చెక్కుతున్నప్పటికీ ఎంబీఏ చేసి ఒక ప్రైవేట్​ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కానీ... 2008 నుంచి తన ఆసక్తి శిల్పకళ దిశగా ఉందని చేస్తున్న ఉద్యోగం మానేసి ఈ వైపు వచ్చేశాడు. అరుణ్​​ చెక్కిన శిల్పాల్లో ముఖ్యమైనవి కేదార్​నాథ్​లోని 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం. ఢిల్లీలో ఇండియా గేట్​ వద్ద ఉన్న 30 అడుగుల సుభాష్​ చంద్రబోస్​ విగ్రహం. 

‘‘మా నాన్న శిల్ప కళకే పూర్తి జీవితాన్ని అంకితం చేశాడు. చిన్నప్పట్నించీ ఆయన్ని చూస్తూ పెరిగాను. నాకు నాన్న, తాత స్ఫూర్తి. మా తాత బసవన్న శిల్పిని మైసూర్​ రాజు సత్కరించాడు. ఆయన నేషనల్​ అవార్డ్​ విన్నర్​ కూడా. మా నాన్న యోగిరాజ్​  నైపుణ్యవంతులైన శిల్పి. మా కుటుంబంలో ఐదో తరం శిల్పిని నేను. 

ఎంబీఏ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏదో వెలితి నన్ను వెంటాడేది. అదే మళ్లీ నన్ను శిల్ప కళ వైపు తీసుకొచ్చింది. ఆ తరువాత మా నాన్న ప్రోత్సా హంతో శిల్పాలు చెక్కుతున్నా. మైసూరులో జయచామరాజేంద్ర వొడియార్​, పరమహంస విగ్రహాలు చెక్కడంతో శిల్పిగా నా కెరీర్​ మొదలైంది అని చెప్పొచ్చు.

ఆ తరువాత యునిక్​ డిజైన్స్​ చేయడం ప్రాక్టీస్​ చేశాను. అయోధ్య రామ మందిరంలో రామ్​లల్లా విగ్రహం చెక్కే అవకాశం రావడం నాలోని ప్యాషన్​కు జీవం పోసింది. రామ్​ లల్లా కోసం మూడు విగ్రహాలు పంపితే కర్నాటక నుంచి రెండు సెలక్ట్​ అయ్యాయి. వాటిలో నేను చెక్కిన శిల్పం ఒకటి ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఐదు తరాలుగా మా కుటుంబం శిల్పులుగా ఉన్నారు. మా కుటుంబ సంప్రదాయానికి దక్కిన ఈ అవకాశం ఎంతో గౌరవాన్ని తెచ్చి పెట్టింది.

అంత ఈజీ కాదు

కేదార్​నాథ్​​లో శంకరాచార్య విగ్రహాన్ని చెక్కాను. దాని తరువాత ఢిల్లీ ఇండియా గేట్​ దగ్గర 30 అడుగుల సుభాష్​ చంద్ర బోస్​  గ్రానైట్​ విగ్రహం కోసం ప్రెసిడెంట్ ఆఫ్​ ఇందిరా గాంధీ నేషనల్​ సెంటర్​ ఫర్​ ది ఆర్ట్స్​(ఐజిఎన్​సిఎ) రికమండ్​ చేసింది. ఈ సెలక్షన్​కు డెమాన్​స్ట్రేషన్​ మీటింగ్​తో పాటు కమిటీ ఇంటర్వ్యూ కూడా జరిగింది.
రామ్​ లల్లాకు రాయి ఎంపిక అనేది చాలా కష్టమైన పని. ఇండియాలో రకరకాల ప్రాంతాల నుంచి రాళ్లు తెప్పించి చూశాం. ఇండియా నుంచే కాకుండా కర్కల, నేపాల్​ల నుంచి కూడా రాళ్లు తెప్పించారు. నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ రాక్​ మెకానిక్స్​ (ఎన్​ఐఆర్​ఎమ్​), భారత ప్రభుత్వ మైన్స్​ డిపార్ట్​మెంట్​ వాళ్లు ప్రతీ రాయిని పరీక్షించారు. నాణ్యత పరీక్షలు చేశాక కర్నాటకకు చెందిన హెచ్​డి కోటెకి చెందిన క్రిష్ణ శిలను ఎంపిక చేశారు.

ఇంతవరకు మనం ఎవరూ చూడని, రాముడి బాల్యపు విగ్రహాన్ని చెక్కడం పెద్ద సవాల్​. ఎందుకంటే రామ్​ లల్లా ఇలా ఉంటాడనే ఆధారం మన దగ్గర ఫిజికల్​గా ఏమీ లేవు. కాకపోతే లల్లా విగ్రహానికి రిఫరెన్స్​గా1200 ఫొటోలు చూశాం. బాల రాముడు అమాయకత్వాన్ని, హుందాతనాన్ని పట్టుకుని శిల్పంగా మలచడం అనేది పెద్ద బాధ్యత. రామ్​ లల్లా విగ్రహం పాదాల నుంచి శిరస్సు వరకు 51 అంగుళాలు ఉంటుంది. ఇలా చేయడం వెనక ప్రత్యేక కారణం ఉంది.

రామనవమి నాడు సూర్య కిరణాలు విగ్రహం శిరస్సు మీద పడాలి. అలాగే ఐదేండ్ల బాల రాముడిలా కనిపించాలి అనే సూచనలు అందాయి. అందుకని ఐదారేండ్ల పిల్లల ముఖంలోని అమాయకత్వాన్ని పట్టుకునేందుకు నేను నర్సరీ స్కూల్​ పిల్లలను బాగా అబ్జర్వ్ చేశాను. రాముడిలోని అమాయకత్వం, తేజస్సును కలిపి విగ్రహం చెక్కడం ఒక ఛాలెంజ్​. ఈ విగ్రహాన్ని చెక్కడం ఆరు నుంచి ఏడు నెలలు పట్టింది.

ఒక్కో శిల్పి ఎవరికి వాళ్లు విడిగా రామ్​ లల్లా విగ్రహాలను చెక్కారు. ఇలా చేయడం వెనక కారణం అపూర్వంగా, అద్భుతంగా ఉండాలి. ఈ పనికి ఎంపికైన శిల్పులం ఒకరికొకరం బాగా తెలిసినప్పటికీ పని గురించి మాత్రం ఒకరితో ఒకరం మేం కమ్యూనికేట్​ చేసుకోలేదు. అంతెందుకు చెక్కిన విగ్రహాలకు సంబంధించిన ఫొటోగ్రాఫ్​ కూడా తీసుకోలేదు. మూడు విగ్రహాల్లో ఎంపిక అయిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తే... మిగతా రెండింటిని రామ మందిరం సముదాయంలోని ఇతర ప్రాంతాల్లో ఉంచుతారు” అని చెప్పాడు.