రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య ఆలయ పనులు పూర్తి

రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య ఆలయ పనులు పూర్తి

అయోధ్య: చారిత్రక నగరం అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన నిర్మాణ పనులన్నీ పూర్తయినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు శివుడు, గణపతి, హనుమంతుడు, సూర్యదేవుడు, భగవతి దేవి, అన్నపూర్ణ దేవి, శేషావతార్ ఆలయ నిర్మాణాలు పూర్తయినట్టు ‘ఎక్స్’ లో వెల్లడించింది. 

“ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని రాముడి భక్తులందరికీ తెలియజేయడానికి మేం చాలా సంతోషిస్తున్నాము. ఈ దేవాలయాలపై జెండాలు, కలశాలను కూడా ప్రతిష్ఠించాం’’ అని ట్రస్ట్ పేర్కొంది. మహర్షి వాల్మీకి, రిషి వశిష్ట, రిషి విశ్వామిత్ర, రిషి అగస్త్య, నిషాద్రాజ్, శబరి, దేవి అహల్యకు అంకితం చేసిన ఏడు మండపాల నిర్మాణం కూడా పూర్తయిందని ట్రస్ట్ తెలిపింది.

‘‘సంత్ తులసీదాస్ ఆలయ నిర్మాణం పూర్తయింది. జటాయువు, పవిత్రమైన ఉడుత విగ్రహాలను సైతం ప్రతిష్ఠించాం” అని ట్రస్ట్ వివరించింది. ప్రస్తుతం ప్రజలకు నేరుగా సంబంధం లేని పనులు మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పింది. సరిహద్దు గోడ, ట్రస్ట్ కార్యాలయం, గెస్ట్ హౌస్, ఆడిటోరియం వంటి పనులు జరుగుతున్నాయని పేర్కొంది.