
తైపీ: ఇండియా యంగ్ షట్లర్ ఆయుష్ షెట్టి.. తైపీ ఓపెన్ సూపర్–300 టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన మెన్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆయుష్ 21–16, 15–21, 21–17తో సీనియర్ సహచరుడు, మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌పై పోరాడి గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు. గంట పాటు జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ ఆరంభంలో కాస్త ఇబ్బందిపడ్డాడు. దీంతో శ్రీ 15–14తో లీడ్‌లోకి వెళ్లాడు. ఈ దశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గిన ఆయుష్ ఈజీగా తొలి గేమ్ నెగ్గాడు. రెండో గేమ్‌లో భిన్నమైన షాట్లతో వ్యూహాత్మకంగా ఆడిన శ్రీకాంత్ వరుస పాయింట్లతో ఆయుష్‌కు చెక్ పెట్టాడు.
కానీ డిసైడర్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆయుష్ 7–3 ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే పుంజుకున్న శ్రీ 13–13, 14–15తో స్కోరు సమం చేసినా గేమ్‌లో ముందుకు సాగలేకపోయాడు. మరో మ్యాచ్‌లో తరుణ్ మానేపల్లి 13–21, 9–21తో మహ్మద్ జాకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21–12, 21–7తో లిన్ సిహ్ యున్ (చైనీస్‌తైపీ)పై నెగ్గింది.