క్రికెట్ బ్యాట్‌పై పాలస్తీనా జెండా.. భారీ జరిమానా వేసిన బోర్డు

క్రికెట్ బ్యాట్‌పై పాలస్తీనా జెండా.. భారీ జరిమానా వేసిన బోర్డు

పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అజామ్ ఖాన్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. పాలస్తీనా జెండా ఉన్న బ్యాట్ ను ఉపయోగించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. కరాచీ వైట్స్, లాహోర్ బ్లూస్ మధ్య జరిగిన జాతీయ T20 కప్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.  మిడిలార్డర్ బ్యాటర్ అజం ఖాన్‌పై పాలస్తీనా జెండా ఉన్న బ్యాట్‌ను ఉపయోగించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 50 శాతం జరిమానా విధించింది. 

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనల ప్రకారం.. ఏ క్రికెటర్ కూడా రాజకీయ, మతపరమైన భావాలకు సంబంధించిన లోగో ఉన్న బ్యాట్ ఉపయోగించడానికి వీలు లేదు. అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లలో కూడా ఐసీసీ నిబంధనలను ఆటగాళ్లు బోర్డు సభ్యులు తప్పనిసరిగా పాటించాలి. ఇదే టోర్నమెంట్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో అజామ్ ఖాన్ బ్యాట్‌పై లోగో ఉంది. కానీ ఎవరూ ఈ 25 ఏళ్ళ బ్యాటర్ ను హెచ్చరించలేదు. 

భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదాన్ని పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ క్రికెట్‌లోకి తీసుకొని వచ్చి వివాదంలో ఇరుక్కున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రిజ్వాన్.. పాకిస్తాన్ జట్టు విజయాన్ని గాజా(పాలస్తీనా) పౌరులకు అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. రిజ్వాన్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని, ప్రపంచ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కొంతమంది సూచిస్తే.. భారత క్రికెట్ జట్టు స్టార్లు ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలు చేయరని కొందరు అభిప్రాయపడ్డారు.