బీటెక్ గ్రాడ్యుయేట్లు పెట్టిన రెస్టారెంట్లు

బీటెక్ గ్రాడ్యుయేట్లు పెట్టిన రెస్టారెంట్లు

అమీర్‌‌‌‌‌‌‌‌పేట్ మీదుగా వెళ్తుంటే మైత్రివనం దగ్గర ‘బీటెక్ బిర్యానీ’ అనే రెస్టారెంట్ కనిపించింది. చిక్కడపల్లిలో ‘బీటెక్ ఛాయ్‌‌‌‌వాలా’ అనే మరో రెస్టారెంట్ కనిపించింది. బీటెక్ అనేది రెస్టారెంట్ బ్రాండేమోనని గూగుల్ చేస్తే కాదని తేలిపోయింది. అసలు విషయం తెలుసుకోవాలని కాస్త రీసెర్చ్ చేస్తే.. అవన్నీ బీటెక్ గ్రాడ్యుయేట్లు పెట్టిన రెస్టారెంట్లు అని తెలిసింది. చదువు మీద ప్రేమతో వాటికి ‘బీటెక్’ అన్న ట్యాగ్ తగిలించారన్నమాట. ఇంజనీరింగ్ చదివి చెఫ్స్‌‌‌‌గా మారిన కొందరు బీటెక్ బాబులను వాళ్ల జర్నీ గురించి అడిగితే ఇలా చెప్పారు.

అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో బీటెక్ బిర్యానీ నడుపుతున్న యశ్వంత్‌‌‌‌ది నల్గొండ. చిన్నప్పటి నుంచి అమ్మ చేసే వంటలు చూస్తూ పెరిగాడు. పండుగలప్పుడు పిండివంటలు చేయడంలో హెల్ప్ చేసేవాడు కూడా. అదే తన ఫుడ్ బిజినెస్‌‌‌‌కు ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌గా మారిందని చెప్పాడు.

బీటెక్ బిర్యానీ
“ నేను అబిడ్స్‌‌‌‌లోని మెథడిస్ట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివా. ఇంజినీర్ అవ్వాలన్న కోరికతో పాటు నాకు ఫుడ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే  బీటెక్ పూర్తవ్వగానే కూకట్‌‌‌‌పల్లిలో ఒక ఫుడ్ ట్రక్ పెట్టా. అది సక్సెస్ కాలేదు. దాంతో కొంతకాలం జాబ్ చేశా. మరోసారి పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘బీటెక్ బిర్యానీ’ పెట్టా. నా రెస్టారెంట్‌‌‌‌ను ఒక మామూలు ఫుడ్ బిజినెస్‌‌‌‌లా కాకుండా ఒక బ్రాండ్‌‌‌‌గా మార్చాలనుకున్నా. అందుకే ‘బీటెక్’ అన్న ట్యాగ్ తగిలించా. ఆ ఏరియాలో స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్లందరికీ ఈ పేరు కనెక్ట్ అవుతుంది. అలాగే పేరు కింద ‘యాన్ ఎఫర్ట్ బై ఇంజినీర్’ అన్న క్యాప్షన్ పెట్టా. ‘ఒక ఇంజినీర్ చెఫ్‌‌‌‌గా మారి చేస్తున్న ప్రయత్నం’ అని దానర్థం. నా ఐడియా సక్సెస్ అయింది. ప్రస్తుతం ‘బీటెక్ బిర్యానీ’ బాగా నడుస్తోంది. దీనికోసం కొన్ని నెలలు కష్టపడి బిర్యానీ తయారీ నేర్చుకున్నా. రెస్టారెంట్‌‌‌‌కు వచ్చిన వాళ్లు నా జర్నీ తెలుసుకుని ఇన్‌‌‌‌స్పైర్ అయ్యామని చెప్తుంటారు. అది ఎంతో సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం బీటెక్ బిర్యానీ అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో మాత్రమే ఉంది. త్వరలోనే సిటీలో మరిన్ని బ్రాంచ్‌‌‌‌లు ఓపెన్ చేయాలనుకుంటున్నా” అన్నాడు యశ్వంత్.

బీటెక్ ఛాయ్‌‌‌‌వాలా
శశికాంత్ జాదవ్, ప్రేమ్, సంజీవ్, అర్జున్‌‌‌‌లు హైదరాబాద్‌‌‌‌లోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. అందులో శశికాంత్‌‌‌‌కు ఛాయ్ అంటే చెప్పలేనంత ఇష్టం. చదువు కునే రోజుల్లో కేవలం ఛాయ్ తాగడం కోసమే సిటీ అంతా తిరిగేవాడు. అప్పుడే అతని బుర్రలో చాయ్‌‌‌‌ ఐడియా మెరిసింది. ఫ్రెండ్స్ అంతా కలిసి 2017లో రోడ్డు పక్కన ఒక చిన్న టీ స్టాల్ పెట్టారు. కానీ, దాన్ని రోడ్డు వైడెనింగ్‌‌‌‌లో తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో జాబ్‌‌‌‌లో చేరిపోయారు. నెలకు ఆరంకెల జీతం వస్తున్నా వాళ్ల మనసంతా ఛాయ్ మీదే ఉండేది. దాంతో 2021లో చిక్కడపల్లిలో ‘బీటెక్ ఛాయ్‌‌‌‌వాలా’ను మొదలుపెట్టారు.

మేమే ఎగ్జాంపుల్
“ మన దేశంలో నీళ్ల తర్వాత ఎక్కువగా తాగే డ్రింక్ ఏదైనా ఉంటే అది ఛాయ్ మాత్రమే. ఛాయ్ అంటే నాకు చిన్నప్పట్నుంచీ ఇష్టం. ఇంట్లో రకరకాల ఛాయ్‌‌‌‌లు తయారుచేసేవాడ్ని. ఆ ఇంట్రెస్ట్‌‌‌‌తోనే ‘బీటెక్ ఛాయ్‌‌‌‌వాలా’ పుట్టింది. మేం బీటెక్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మా బిజినెస్‌‌‌‌కు ‘బీటెక్’ అన్న ట్యాగ్ తగిలించాం. ‘బీటెక్ ఛాయ్‌‌‌‌వాలా’ అంటే ‘ఛాయ్‌‌‌‌ని ఇష్టపడే బీటెక్ స్టూడెంట్స్’ అని అర్థం. ఛాయ్, బీటెక్.. ఇవి రెండూ పదాలు కాదు, ఎమోషన్స్. అందుకే ఆ పేరుని ఎంచుకున్నాం. మా టీ షాపులో 16 రకాల నేచురల్ ఫ్లేవర్ టీలు తయారుచేస్తాం. అన్ని ఫ్లేవర్స్ అప్పటికప్పుడు ఫ్రెష్‌‌‌‌గా తయారుచేసి టీ చేస్తాం. మా ఎఫర్ట్‌‌‌‌కు కస్టమర్ల నుంచి మంచి ఫీడ్‌‌‌‌బ్యాక్ వస్తుంది. బీటెక్ స్టూడెంట్స్.. మా సైన్ బోర్డు దగ్గర సెల్ఫీలు దిగుతుంటే థ్రిల్లింగ్‌‌‌‌గా అనిపిస్తుంది. బీటెక్ చదివిన వాళ్లు ఉద్యోగాలతో పాటు సొంత బిజినెస్‌‌‌‌లు కూడా చేసుకుంటూ సక్సెస్ అవ్వొచ్చు. దానికి మేమే ఎగ్జాంపుల్. ప్రస్తుతం మా కెఫె చిక్కడపల్లిలో ఉంది. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో ఇంజినీరింగ్ కాలేజీలున్న అన్ని ప్రాంతాల్లో మా బ్రాంచీలు ఓపెన్ చేయాలనుకుంటున్నాం” అని ఉత్సాహంగా చెప్పాడు శశికాంత్. 

బీటెక్ బాబు స్పైసీ హౌస్
బాచుపల్లిలో ఉన్న ‘బీటెక్ బాబు స్పైసీ హౌస్’ది కూడా ఇలాంటి కథే. చైనీస్ ఫుడ్ లవర్ అయిన శ్రీకాంత్.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌‌‌‌లో బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత నాలుగేండ్లు ‘రెగల్ బెలాయిట్ కార్పొరేషన్’లో పనిచేశాడు. తర్వాత కాగ్నిజెంట్‌‌‌‌లో చేరాడు. ఉద్యోగం చేస్తున్నా.. అతని మనసులో మాత్రం సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలని ఉండేది. దాంతో జాబ్ మానేసి, ఒక చైనీస్ రెస్టారెంట్ పెట్టాడు. వందకుపైగా వెరైటీలు అందిస్తూ స్పైసీ హౌస్‌‌‌‌ను సక్సెస్​ఫుల్‌‌‌‌గా నడిపిస్తున్నాడు.

ఇంజినీరింగ్ హెల్ప్ చేసింది
“ఉద్యోగం మానేసి ఫుడ్ బిజినెస్ పెట్టాలన్న నా ఆలోచన ఇంట్లో వాళ్లకు నచ్చలేదు. అయినా ఒప్పించి బిజినెస్ మొదలుపెట్టా. ఫుడ్ బిజినెస్‌‌‌‌కు సరైన పేరు ఉంటే సగం సక్సెస్ అయినట్టే. అందుకే నేను ఇష్టపడి చదువుకున్న బీటెక్‌‌‌‌ను నా బిజినెస్ పేరుకు తగిలించా. ‘బీటెక్ బాబు స్పైసీ హౌస్’ అనే పేరు నాకే చాలా కొత్తగా అనిపించింది. అందుకే అలా పెట్టా.  బీటెక్ చదవడం వల్ల నాలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి. నేనొక ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌గా మారడానికి ఇంజినీరింగ్ ఎంతో హెల్ప్ చేసింది. మా రెస్టారెంట్‌‌‌‌లో నాతో పాటు ఇద్దరు నేపాలీ చెఫ్‌‌‌‌లు పనిచేస్తున్నారు. మా దగ్గర వందకు పైగా చైనీస్ వెరైటీలు దొరుకుతాయి. హాంకాంగ్ చికెన్, షెజ్వాన్ రైస్‌‌‌‌ మా దగ్గర ఫేమస్.  ఈమధ్యనే నా ఫ్రెండ్ ఈ రెస్టారెంట్ ఫ్రాంఛైజీ తీసుకుని సంగారెడ్డిలో బ్రాంచ్ పెట్టాడు. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో మరిన్ని ఫ్రాంఛైజీలు ఇవ్వాలనుకుంటున్నా” అన్నాడు శ్రీకాంత్. :: తిలక్​