ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు

అడవి ఇక్కడ... ఆఫీస్​ అక్కడ!
మెదక్ ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ సిద్ధిపేటకు షిఫ్ట్
కార్యాలయం తరలింపుపై నిరసనలు.. విమర్శలు
కొత్త జోనల్​వ్యవస్థతో అనూహ్య మార్పులు

మెదక్, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు టెరిటోరియల్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ డివిజన్‌‌ ఆఫీస్ ‌‌(డీఎఫ్‌‌‌‌వో)​, వైల్డ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ డివిజన్‌‌‌‌ ఆఫీస్​ (డీఎఫ్ వో) మెదక్ పట్టణంలో, సోషల్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ డివిజన్‌‌ ఆఫీస్​ ‌‌(డీఎఫ్‌‌‌‌ వో) సంగారెడ్డిలో ఉండేవి. ఈ మూడు ఆఫీసులు నిజామాబాద్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ పరిధిలో ఉండేవి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌‌‌‌ వ్యవస్థీకరణ చేపట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో టెరిటోరియల్, వైల్డ్​ లైఫ్, సోషల్ ​ఫారెస్ట్​ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో మెదక్‌‌‌‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వేర్వేరుగా డిస్ట్రిక్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసులను ఏర్పాటు చేయగా, ఈ మూడింటిని కలిపి ఒక ఫారెస్ట్‌‌‌‌ సర్కిల్ గా ఏర్పాటు చేశారు. ఈ మేరకు మెదక్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ హెడ్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ను మెదక్ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్కిల్‌‌‌‌ ఇన్​చార్జిగా ఫారెస్ట్‌‌‌‌ కన్వర్వేటర్‌‌‌‌ (సీసీఎఫ్‌‌‌‌)ను నియమించారు. 

సిద్దిపేటకు తరలింపు.. 

రాష్ట్రంలో కొత్త జోనల్​ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో 2019లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్‌‌‌‌ సర్కిళ్ల పునర్‌‌‌‌ వ్యవస్థీకరణ చేపట్టింది. గతంలో 12 ఫారెస్ట్​ సర్కిళ్లు ఉండగా వాటిని ఏడుకు కుదించింది. ఈ క్రమంలో మెదక్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ రద్దయింది. మెదక్‌‌‌‌, సిద్దిపేట జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసిన రాజన్న సిరిసిల్ల సర్కిల్‌‌‌‌ పరిధిలోకి వెళ్లగా, సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన చార్మినార్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ పరిధిలోకి వెళ్లింది. రాజన్న సిరిసిల్ల ఫారెస్ట్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ హెడ్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. కాగా ఈ నిర్ణయం జరిగిన మూడేళ్ల తర్వాత సిద్దిపేటలో ఫారెస్ట్​ సర్కిల్​ ఆఫీస్​ రెడీ అయ్యింది. దీంతో ప్రస్తుతం మెదక్‌‌‌‌ లో ఉన్న ఫారెస్ట్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ ఆఫీస్​ ను అక్కడికి తరలించారు. ఇక్కడి స్టాఫ్​ ను సర్దుబాటు 
చేస్తున్నారు. మెదక్​ సర్కిల్​ ఆఫీస్​ రద్దు కావడంతో ఇంతవరకు మెదక్​ లో సీసీఎఫ్​గా పనిచేసిన శరవనణ్​ నిర్మల్​ బాసర సర్కిల్​ కు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ఇదిలా వుండగా, మెదక్‌‌‌‌లో ఉన్నఫారెస్ట్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ ఆఫీస్​ ఎత్తివేసి  జిల్లాను సిద్దిపేటలో కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన రాజన్న సిరిసిల్లా సర్కిల్‌‌‌‌ పరిధిలోకి చేర్చడంపై ఇక్కడి ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. 

మెదక్​ జిల్లాలో అటవీ విస్తీర్ణం 58 వేల హెక్టార్లు ఉండగా, సిద్దిపేట జిల్లాలో 23 వేల హెక్టార్లు మాత్రమే ఉంది. మెదక్​ జిల్లాలో అడవులతోపాటు, పోచారం వైల్డ్‌‌‌‌లైఫ్‌‌‌‌ శాంచరీ, అందులో రెండు జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అందువల్ల మెదక్‌‌‌‌లోనే కొత్త సర్కిల్‌‌‌‌ కార్యాలయాన్ని  ఏర్పాటు చేస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ మెదక్‌‌‌‌ నుంచి సిద్దిపేటకు తరలిపోయింది. అటవీశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్‌‌ ‌‌సర్కిళ్లను పునర్‌‌‌‌ వ్యవస్థీకరించడంతో ఈ మార్పు జరిగింది. కాగా, ఎక్కువ అటవీ విస్తీర్ణం, దట్టమైన అడవులు, అభయారణ్యం ఈ జిల్లా పరిధిలో ఉండగా, సర్కిల్​ ఆఫీస్ ను మరో జిల్లాకు తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నిరసన తెలుపుతున్నారు. 

కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన

మెదక్ నుంచి ఫారెస్ట్​ సర్కిల్​ ఆఫీస్​ను ఎత్తివేసి సిద్దిపేటలో ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్​ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. టీపీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఫారెస్ట్​ సర్కిల్​ ఆఫీస్​ వద్ద నిరసన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో మెదక్​ పట్టణం జిల్లా అటవీ కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న విషయాన్నిఆయన గుర్తు చేశారు. ఎక్కువ విస్తీర్ణం అడవులు, అభయారణ్యం ఉన్న జిల్లాలోని సర్కిల్​ ఆఫీస్​ ను తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్నజిల్లాకు తరలించడం సరైంది కాదన్నారు. కొత్త కార్యాలయాలకు తీసుకురావాల్సింది పోయి ఉన్న కార్యాలయాలు మరోచోటకు తరలిస్తున్నా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిదులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

భవిష్యత్​ అంతా స్మార్ట్​ సిటీలదే..
బెంగళూరు ఎయిర్​ పోర్ట్​ సిటీ సీఈవో రావు మునుకుట్ల

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  భవిష్యత్​ మొత్తం స్మార్ట్ సిటీలపైనే ఆధారపడి ఉందని, ప్రపంచ జనాభాలో సగానికి పైగా సిటీలు 80 శాతం జీడీపీని అందిస్తున్నాయని బెంగళూరు ఎయిర్​ పోర్ట్​ సిటీ లిమిటెడ్ సీఈవో రావు మునుకుట్ల చెప్పారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో సోమవారం టీచర్స్​ డే  సందర్భంగా ‘స్మార్ట్ సిటీస్ - ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్’​ అనే అంశంపై వర్క్​ షాప్​ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావు మునుకుట్ల హాజరై మాట్లాడారు. 2050 నాటికి 70 శాతం మంది ప్రజలు పట్టణాలకు షిఫ్ట్​ అవుతారని, 90 శాతం ఆర్థిక కార్యకలాపాలు సిటీల నుంచే జరుగుతాయని అభిప్రాయపడ్డారు. స్మార్ట్​, మెగా సిటీలు పెరిగి టెక్నాలజీ ప్రధానంగా మారుతుందన్నారు. బెంగళూరు ఎయిర్​పోర్ట్​ సిటీ ప్రాజెక్టుతో పరిశోధనలు చేపట్టడానికి ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ప్రొఫెసర్​ శివరామ కృష్ణప్రసాద్, ఎస్​.ఫణికుమార్, పీ.ఈశ్వరయ్య, పీ.త్రినాథరావు, డాక్టర్ జీ.జ్యోతికుమారి పాల్గొన్నారు. 

టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి
మాజీ మంత్రి బాబు మోహన్

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని మాజీ మంత్రి బాబు మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు. కంది మండల పరిధిలోని చంధ్రుప్ప, తండా, ఆరుట్ల, బ్యాతోల్, వడ్డెన గూడ తాండ, కొయ్య గూడ తాండ, మామిడిపల్లి, కౌలంపేట, చిమనాపూర్ గ్రామాల మీదుగా ర్యాలీ కొనసాగింది . ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల గోసను క్షేత్ర స్థాయిలో తెలుసుకోడానికే బీజేపీ ఈ ర్యాలీ చేపట్టిందని తెలిపారు. కుటుంబ పాలన, అవినీతిని అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ర్యాలీలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జగన్, నియోజకవర్గ ఇన్​చార్జి రాజేశ్వరరావు దేశ్​పాండే, నెమలికొండ వేణుమాధవ్,  అశ్వంత్, రాములు, అరవింద్ పాల్గొన్నారు.

కేసీఆర్ పాలనలోనే రైతులు అభివృద్ధి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

కొమురవెల్లి, వెలుగు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే రైతులు అభివృద్ధి చెందారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ డ్యామ్​లోకి మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు తెచ్చేందుకు చేపట్టనున్న కాల్వల పనులకు సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం పాలనతోనే తెలంగాణ రైతులకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం జగదేవపూర్ మండలంలోని  తీగుల్ నర్సాపూర్ లోని కొండపోచమ్మను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ఆలయ అధికారులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, నాయకులు నాగమల్ల సత్యనారాయణ, బూరుగు నారాయణ, పుట్ట కనకరాజుతో పాటు
 పలువురు పాల్గొన్నారు.

తాటి చెట్లను నరికేసినవారిపై చర్యలు తీసుకోవాలి
గీత కార్మికుల ఆందోళన

కోహెడ(హుస్నాబాద్), వెలుగు : తాటి చెట్లను నరికేసినవారిపై చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని తోటపల్లి శివారులో చౌటపల్లి క్రాసింగ్ వద్ద సోమవారం కల్లు గీత కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ తన భూమిలో ఉన్న దాదాపు 100 తాటి చెట్లను రాత్రికి రాత్రే నరికి వేశాడని ఆరోపించారు. కల్లు పారే చెట్లను తొలగించడంతో తమ జీవనోపాధిని కోల్పోయామని వాపోయారు. తాటి చెట్లను తొలగించిన వ్యక్తిపై పీడీ యాక్టు పెట్టాలని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పర్మిషన్​ ఇచ్చిన ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు. కల్లు గీత కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. 

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
ఎమ్మెల్యే వొడితెల సతీశ్​ కుమార్​

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు : తెలంగాణలో సీఎం కేసీఆర్​ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితెల సతీశ్​కుమార్​అన్నారు. సోమవారం హుస్నాబాద్ ​క్యాంపు ఆఫీస్​లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను, అక్కన్నపేటలో ఆసరా పెన్షన్​ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్​ అన్నారు. దేశంలో  గత70 ఏళ్ల బీజేపీ, కాంగ్రెస్​ పాలనలో చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్​ఎస్​ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. అంతకుముందు హుస్నాబాద్​లో దళిత బంధు స్కీంలో ఎంపికైన యూనిట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి కర్ర శ్రీహరి, మున్సిపల్​ చైర్​ పర్సన్​ రజిత, వైస్​ చైర్మన్​ అనిత, ఎంపీపీలు మానస, లక్ష్మి, కీర్తి, జడ్పీటీసీలు మంగ,శ్యామల పాల్గొన్నారు.

పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్  ప్రారంభం 

మెదక్​ (శివ్వంపేట), వెలుగు:  శివ్వంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ షాపింగ్ కాంప్లెక్స్ ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునీతారెడ్డి ప్రారంభించారు. ప్రైవేట్​లో కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారుల సౌకర్యార్థం  గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్​ నిర్మించి తక్కువ కిరాయికి ఇవ్వడాన్ని అభినందించారు. త్వరలో మరో 15 షెట్టర్లు నిర్మిస్తామని జడ్పీటీసీ మహేశ్​గుప్తా, సర్పంచ్​ శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ భవనానికి సునీతారెడ్డి, మదన్ రెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జిల్ల గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్​ మన్సూర్ అలీ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, సొసైటీ చైర్మన్ వెంకట రామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్ పాల్గొన్నారు. 

సమస్యల పరిష్కారంలో ముందుండాలి

సిద్దిపేట రూరల్/సంగారెడ్డి టౌన్/మెదక్​టౌన్, వెలుగు : ప్రజల సమస్యలను తీర్చడంలో అధికారులు ముందుండాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్  వీరారెడ్డి,  మెదక్​ ఆర్డీవో సాయిరామ్ ​సంబంధిత ఆఫీసర్లకు  సూచించారు. సోమావారం ప్రజావాణిలో వారు అర్జీలను స్వీకరించారు. సిద్దిపేటలో ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ లు, రెవెన్యూ తదితర సమస్యలపై 42, మెదక్​లో 62  దరఖాస్తులు వచ్చాయి.  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటవెంటనే పరిశీలించి పరిష్కరించి పై ఆఫీసర్లకు నివేదిక ఇవ్వాలని సూచించారు. 

సింగూర్ రెసిడెన్షియల్ ను తనిఖీ చేసిన కలెక్టర్

పుల్కల్/వెలుగు :  సంగారెడ్డి జిల్లా పుల్కల్​ మండలంలోని సింగూర్ రెసిడెన్షియల్ ను సోమవారం కలెక్టర్​ డాక్టర్​ శరత్  తనిఖీ చేశారు. స్కూల్​ పరిసరాలు,  అందిస్తున్న భోజనం తీరును చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిచెన్ లో నాణ్యత లేని, ఎక్స్ పైర్ అయిన వంట సామగ్రిని వాడుతూ రికార్డులో బ్రాండెడ్ సామగ్రిగా నమోదు చేయడాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మీ పిల్లలకు గిట్లనే వండి పెడతారా’ అంటూ ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ , మెస్ ఇన్​చార్జీలతో పాటు క్లీనింగ్ సరిగ్గా లేకపోవడంతో స్వీపర్లకు మెమోలను జారీ చేశారు.  ప్రిన్సిపాల్ రత్నంను సస్పెండ్ చేసి వైస్ ప్రిన్సిపాల్ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల్లో పద్ధతి మారకుంటే వంట కాంట్రాక్టు క్యాన్సల్ చేసి మహిళా సంఘలకు అప్పగిస్తామన్నారు. వారానికి రెండుసార్లు హాస్టల్​ను పర్యవేక్షించాలని తహసీల్దారు పరమేశం, ఎంపీడీవో మధులతను ఆదేశించారు. స్వచ్ఛ గురుకుల్​లో భాగంగా స్కూల్ పరిసర ప్రాంతంలో 1500 మొక్కలు నాటాలని సిబ్బందికి  సూచించారు. 

ఘనంగా టీచర్స్​ డే 

టీచర్స్​ డేను ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు స్కూళ్లలో సోమవారం ఘనంగా నిర్వహించారు.  సర్వేపల్లి రాధాకృష్ణ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులను సన్మానించారు. సంగారెడ్డి కలెక్టరేట్​ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ డాక్టర్ శరత్, వైస్ చైర్మన్ ప్రభాకర్, డీసీఎం ఎస్ చైర్మన్ శివకుమార్, అడిషనల్​ కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, డీఈవో రాజేశ్, మెదక్​ కలెక్టరేట్​లోని ప్రోగ్రామ్​లో అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్, డీఈవో రమేశ్​కుమార్, డీఎస్​వో రాజిరెడ్డి, సెక్టోరల్ ఆఫీసర్​ సుభాష్ పాల్గొని పలు సూచనలు చేశారు. పటాన్​చెరు మండల పరిధిలోని చిట్కుల్​ లోని గురుకుల పాఠశాలో స్వచ్ఛ గురుకుల్​  కార్యక్రమాన్ని  ప్రారంభించారు. కార్యక్రమానికి సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్​తో కలిసి చిట్కుల్​ సర్పంచ్​ నీలం మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. సంగారెడ్డి శాంతినగర్ లోని సెయింట్ ఆంథోనీస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల భాషోపాధ్యాయుడు ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఆయనకు మహా నంది అవార్డు వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ అరుణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ విజయ కుమార్ రెడ్డి సన్మానించి అభినందించారు. 

అన్ని వర్గాలకూ ఆర్థిక చేయూత

మెదక్​ టౌన్/నారాయణ్ ఖేడ్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఆర్థిక చేయూతనిచ్చేలా పనిచేస్తోందని ఎమ్మెల్యేలు, పద్మాదేవేందర్​రెడ్డి, భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్​ మండలం కోంటూరు చెరువులో పద్మాదవేందర్​రెడ్డి, నారాయణఖేడ్ ​నియోజకవర్గంలోని కల్హేర్ మండలం మార్డి చెరువులో భూపాల్​రెడ్డి మత్స్య శాఖ సహకారంతో చేప చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో మత్స్యకారుల అభివృద్ధికి, సంక్షేమానికి అనేక రకాలుగా దోహదపడిందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీతో దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకొనేందుకు వాహనాలను అందజేసిందని గుర్తు చేశారు. 
ప్రస్తుతం అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మెదక్​లో మత్స్యశాఖ ఏడీ డాక్టర్​ రజనీ, జడ్పీ వైస్​ చైర్​పర్సన్ లావణ్య, కల్హేర్​లో ఎంపీపీ గుర్రపు సుశీల అంజయ్య, జడ్పీటీసీ నరసింహారెడ్డి, టీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు రాంసింగ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

నర్సాపూర్, వెలుగు : భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన అలివాద ప్రభాకర్ (27)కు పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన నరసమ్మ(లావణ్య)కు కొన్నేండ్ల కింద వివాహం జరిగింది. కాగా, భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో ఇటీవల లావణ్య పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని పంచాయతీ పెట్టినా ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురై ప్రభాకర్​ సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి మానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గంగరాజు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్ డైరెక్టర్ మృతి

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు : రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఎండపల్లి రాజేందర్ రెడ్డి సోమవారం మృతి చెందాడు. జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి(48) పిల్లల చదువుల కోసం హైదరాబాద్ లోని గాజులరామారంలో నివాసం ఉంటున్నాడు. అతడు సోమవారం రాత్రి బైక్​పై షాపూర్​ నగర్​ నుంచి గాజులరామారం వెళ్తుండగా చిత్తారమ్మ గుడి వద్ద బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేందర్ రెడ్డి గతంలో టీడీపీ, టీఆర్​ఎస్​ లీడర్​గా ఉండగా, గత ఎన్నికలలో కాంగ్రెస్ లో చేరి పీఏసీఎస్​  డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సింగూర్ రెసిడెన్షియల్ ను తనిఖీ చేసిన కలెక్టర్

పుల్కల్/వెలుగు : సంగారెడ్డి జిల్లా పుల్కల్​ మండలంలోని సింగూర్ రెసిడెన్షియల్ ను సోమవారం కలెక్టర్​ డాక్టర్​ శరత్  తనిఖీ చేశారు. స్కూల్​ పరిసరాలు,  అందిస్తున్న భోజనం తీరును చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిచెన్ లో నాణ్యత లేని, ఎక్స్ పైర్ అయిన వంట సామగ్రిని వాడుతూ రికార్డులో బ్రాండెడ్ సామగ్రిగా నమోదు చేయడాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మీ పిల్లలకు గిట్లనే వండి పెడతారా’ అంటూ ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ , మెస్ ఇన్​చార్జీలతో పాటు క్లీనింగ్ సరిగ్గా లేకపోవడంతో స్వీపర్లకు మెమోలను జారీ చేశారు.  ప్రిన్సిపాల్ రత్నంను సస్పెండ్ చేసి వైస్ ప్రిన్సిపాల్ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల్లో పద్ధతి మారకుంటే వంట కాంట్రాక్టు క్యాన్సల్ చేసి మహిళా సంఘలకు అప్పగిస్తామన్నారు. వారానికి రెండుసార్లు హాస్టల్​ను పర్యవేక్షించాలని తహసీల్దారు పరమేశం, ఎంపీడీవో మధులతను ఆదేశించారు. స్వచ్ఛ గురుకుల్​లో భాగంగా స్కూల్ పరిసర ప్రాంతంలో 1500 మొక్కలు నాటాలని సిబ్బందికి  సూచించారు.