తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ
  • కేంద్ర మంత్రి పదవి పోయిన 2 నెలలకే బీజేపీ నుంచి మమత పార్టీలోకి

కోల్‌కతా: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బబుల్ సుప్రియో ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సమక్షంలో ఆయన పార్టీ మారారు. బబుల్ సుప్రియోకు అభిషేక్ బెనర్జీ తృణమూల్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తృణమూల్ ఫ్యామిలీలోకి బబుల్ చేరారంటూ ఆ పార్టీ ట్విట్టర్‌‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నుంచి ఇంకా చాలా మంది తమ పార్టీలోకి మారనున్నారని తృణమూల్ లీడర్ కునాల్ ఘోష్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇవాళ సుప్రియో ఒక్కరే చేరారని, బీజేపీ నేతలు పలువురు తమతో టచ్‌లో ఉన్నారని, రానున్న రోజుల్లో చాలా మంది చేరుతారని చెప్పారు.

రెండు నెలల క్రితం జులైలో కేంద్ర కేబినెట్‌లో భారీగా మార్పులు జరిగిన సమయంలో బబుల్ సుప్రియో తన కేంద్ర మంత్రి పదవిని కోల్పోయారు. ఆ సమయంలో ఆయన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై ఏ పార్టీలో చేరబోనని చెప్పారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణాల్లో మంత్రి పదవి నుంచి తొలగించడం ఒకటని ఆయన జులై 31న చేసిన ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్​ దిలీప్ ఘోష్‌తో ఉన్న విభేదాలు కూడా మరో కారణమని ఆయన అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో బబుల్ సుప్రియో తృణమూల్‌లో చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.