
ఆధునిక జీవనశైలిలో, ముఖ్యంగా యువతలో డైట్ సోడా వినియోగం గణనీయంగా పెరిగింది. బరువు తగ్గాలనుకునేవారు లేదా చక్కెర వినియోగాన్ని నియంత్రించాలనుకునేవారు వీటిని ప్రధాన ప్రత్యామ్నాయంగా భావిస్తారు. డైట్ సోడాలో చక్కెర బదులుగా కృత్రిమ స్వీటెనర్‌లు ఉపయోగించడం వల్ల కేలరీలు తక్కువగా ఉంటాయని నమ్ముతారు. అయితే, ఇటీవల జరుగుతున్న పరిశోధనలు ఈ నమ్మకాన్ని సవాల్ చేస్తున్నాయి. డైట్ సోడా దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజా అధ్యయనం ఏం చెబుతోంది?
ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక నూతన అధ్యయనం డైట్ సోడాల వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా వెల్లడించింది. మోనాష్ యూనివర్సిటీ, RMIT యూనివర్సిటీ ,క్యాన్సర్ కౌన్సిల్ విక్టోరియాకు చెందిన పరిశోధకులు దాదాపు 14 ఏళ్లపాటు 36వేల మంది ఆస్ట్రేలియన్లపై పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయన ఫలితాలు డయాబెటిస్ & మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించారు.
ఈ పరిశోధనలోని కీలక అంశాలు..
డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ: రోజుకు ఒక డబ్బా డైట్ సోడా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 38% పెరుగుతుందని ఈ అధ్యయనం కనుగొంది.
చక్కెర పానీయాల కంటే ఎక్కువ ముప్పు: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కృత్రిమ స్వీటెనర్‌లతో చేసిన పానీయాల వల్ల వచ్చే ప్రమాదం సాధారణ చక్కెర పానీయాల వల్ల వచ్చే ప్రమాదం (23%) కంటే ఎక్కువ.
ప్రత్యామ్నాయం కాదు..ఈ పరిశోధన ప్రకారం.. కృత్రిమ తీపి పానీయాలు చక్కెర పానీయాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయం కావు. ఈ పానీయాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రతిరోజూ తాగడం వల్ల కృత్రిమ స్వీటెనర్‌లతో చేసినవి కావడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఈ పరిశోధన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డైట్ సోడాలు, చక్కెర పానీయాలకు బదులుగా నీరు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లేదా నిమ్మరసం వంటి సహజ పానీయాలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.