మీకు సెల్యూట్ సర్.. గాల్లోనే చిన్నారికి వైద్యం

మీకు సెల్యూట్ సర్.. గాల్లోనే చిన్నారికి వైద్యం

రాంచీ-ఢిల్లీ విమానంలో ఇద్దరు వైద్యులు సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల ఆరు నెలల చిన్నారి ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతోన్న చిన్నారికి విమానంలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు డాక్టర్లు చిన్నారికి వైద్యం చేసి రక్షించారు.

చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు తమ పాపను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, విమానం టేకాఫ్ అయిన వెంటనే, శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. పరిస్థితిని సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విమానంలో ఎవరైనా డాక్టర్ల ఎవరైనా ఉన్నారా అని ఓ అత్యవసర ప్రకటన చేశారు. ఈ సమయంలో రాంచీ సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మొజమ్మిల్ ఫెరోజ్, డాక్టర్ అయిన ఐఎఎస్ అధికారి డాక్టర్ నితిన్ కులకర్ణి చిన్నారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు.

ఎలా రక్షించారంటే..

పెద్దల కోసం ఉద్దేశించిన మాస్క్‌ని ఉపయోగించి వైద్యులు చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేశారు. చిన్నారి మెడికల్ టెస్టులు చూసిన తర్వాత.. అప్పటికే ఆ తల్లిదండ్రుల వద్ద ఉన్న థియోఫిలిన్ ఇంజెక్షన్‌, డెక్సోనా ఇంజెక్షన్ తో పాటు ఇతర అత్యవసర మందులు ఇచ్చారు. మొదటి 15-20 నిమిషాలు చాలా కీలకమైనది, ఒత్తిడితో కూడుకున్నదని డాక్టర్లు చెప్పారు. ఎందుకంటే ప్రారంభంలోనే పురోగతిని అంచనా వేయడం కష్టం. అయితే, కొద్దిసేపటికే, పాప ఏడ్వడం, కళ్ళు తెరవడం ప్రారంభించింది. దీంతో విమానంలోని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

"మేము వైద్య రికార్డులను తనిఖీ చేశాం. శిశువుకు పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ (PDA)ఉంది" అని డాక్టర్ కులకర్ణి చెప్పారు. వైద్యం జరిగిన ఒక గంట తర్వాత విమానం ల్యాండ్ అయింది. ఆ తర్వాత శిశువును వైద్య బృందానికి అప్పగించారు.

మాట్లాడుతూ, “ఒక గంటకు పైగా ప్రయత్నం చేయగా వచ్చిన ఈ ఫలితంతో మేము సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాం అని ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కులకర్ణి తెలిపారు. పరిస్థితిని చూసిన సహ-ప్రయాణికుడు ఎక్స్ లో డాక్టర్లను అభినందించాడు. "వైద్యులు దేవుడు పంపిన దేవదూతలు. ఈ రోజు ఇండిగో విమానంలో ఒక 6 నెలల శిశువును రక్షించడం నేను చూశాను. డాక్టర్ నితిన్ కులకర్ణి, IAS, గవర్నర్ హౌస్, జార్ఖండ్, డాక్టర్ పాత్రను పోషించి, వారిని రక్షించారు. మీకు సెల్యూట్ సార్" అని ప్రయాణీకుడు AS డియోల్ ఎక్స్‌లో రాసుకువచ్చాడు.