బీఆర్ఎస్ నేతలకు చివరి రోజూ నిరసన సెగ

బీఆర్ఎస్ నేతలకు చివరి రోజూ నిరసన సెగ
  • రెడ్డి ఖానాపూర్​లో మట్టి లూటీపై సునీతను అడ్డుకున్న గ్రామస్థులు
  • మున్సిపాలిటీ వద్దంటూ కాసాల వాసుల ఆందోళన
  • బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజల మధ్య వాగ్వాదం
  • ఉద్రిక్తతకు దారితీసిన తోపులాట

సంగారెడ్డి(హత్నూర), వెలుగు :  ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. తమ సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యే అభ్యర్థులను నిలదీశారు. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డి.. మంగళవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని రెడ్డి ఖానాపూర్, కాసాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. ముందుగా రెడ్డిఖానాపూర్​కు రాగా శివారులోని మామిడి చెరువు మట్టి అక్రమ తవ్వకాలపై సర్పంచ్​భర్త,  కాసాల పీఏసీఎస్ ​చైర్మన్ ​దామోదర్ రెడ్డిని నిలదీశారు. దామోదర్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినదించారు. దీంతో కాసాల వెళ్లగా అక్కడ కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. కాసాల,- దౌల్తాబాద్ ను కలిపి మున్సిపాలిటీగా మారుస్తామంటూ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు.

‘‘మున్సిపాలిటీ వద్దు..గ్రామ పంచాయతీ ముద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఊర్లోకి రానిచ్చేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్​ వార్డు మెంబర్ల భర్తలు ఆందోళన చేస్తున్న వారిని తోసెయ్యడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన సునీతా రెడ్డి ప్రచారం రథం దిగి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. పంచాయతీ తీర్మానం లేకుండా మున్సిపాలిటీ చేయడం సాధ్యం కాదని చెప్పడంతో శాంతించారు. తర్వాత వేరే గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిపోయారు. లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ నర్సింహులు, సర్పంచ్ రాణి, ఎంపీటీసీలు బైసాని విజయలక్ష్మి పాల్గొన్నారు..