పుణె యాక్సిడెంట్ కేసులో మైనర్ బెయిల్ రద్దు

పుణె యాక్సిడెంట్ కేసులో మైనర్ బెయిల్ రద్దు
  • జూన్ 5 వరకు రిమాండ్ హోమ్‌‌కు తరలింపు
  • ఇటీవల ఇచ్చిన బెయిల్ షరతులపై దేశవ్యాప్తంగా విమర్శలు 
  • దాంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జువైనల్ కోర్టు!
  • బాలుడి తండ్రిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

ముంబై: మహారాష్ట్రలోని పుణెలో ఓ బాలుడు కారుతో బైకును ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన కేసులో కీలక పరిణా మం చోటుచేసుకుంది. ఈ కేసులో మైనర్ నిందితుడికి ఇచ్చిన బెయిల్‌‌ను ముంబైలోని జువైనల్ కోర్టు రద్దు చేసింది. అతడిని జూన్ 5 వరకు రిమాండ్ హోమ్‌‌కు పంపాలని పోలీసులను ఆదేశించింది. అయితే, నిందితుడిని మేజర్​గా పరిగణించి విచారించాలా వద్దా అనే దానిపై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూన్ 5లోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. బాలుడికి ఇచ్చిన బెయిల్ షరతులపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

అసలేం జరిగిందంటే..!

పుణెలో ఆదివారం లగ్జరీ కారు 200 కిలోమీటర్ల వేగంతో ఓ బైక్ ను ఢీకొట్టింది. దాంతో బైక్ పైన ప్రయాణిస్తున్న ఇద్దరు ఐటీ ఇంజనీర్లు అనిస్ అవధియా, అశ్వినీ కోష్ట అక్కడికక్కడే చనిపోయారు. పోలీసుల దర్యాప్తులో కారు డ్రైవ్ చేసిన నిందితుడు ఓ మైనర్ అని తేలింది. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన బాలుడు.. శనివారం తన స్నేహితులతో కలిసి పోర్షే కారులో పబ్ కు వెళ్లాడు.

అక్కడ మద్యం సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున పబ్ నుంచి తిరిగి వస్తుండగా వెహికల్ కంట్రోల్ తప్పి ఎదురుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. దాంతో మధ్యప్రదేశ్‌‌కు  చెందిన అనిస్ అవధియా, అశ్వినీ కోష్ట స్పాట్​లోనే చనిపోయారు. ప్రమాదానికి కారణమైన మైనర్ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి..జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే, బాలుడిని అరెస్టు చేసిన 15 గంటల్లోనే జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

చర్చనీయాంశమైన షరతులు

బెయిల్ ఇచ్చే సందర్భంలో బాలుడికి జువైనల్ కోర్టు కండీషన్స్ విధించింది. జరిగిన ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని మైనర్ నిందితుడిని ఆదేశించింది. తాగుడు మానివేయడానికి మానసిక నిపుణుడి వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని, భవిష్యత్​లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. నిందితుడిని మేజర్​గా  పరిగణించి దర్యాప్తు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులు కోరగా జువైనల్ కోర్టు తిరస్కరించింది.

బెయిల్ నిరాకరించడానికి కారణాలు కనిపించడంలేదని కోర్టు పేర్కొన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.ఈ కేసులో నిందితుడు స్థానికంగా ఓ ప్రముఖ బిల్డర్ కొడుకని తెలిసింది. జువైనల్ కోర్టు విధించిన షరతులపై, బెయిల్​పై బాధిత కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. షరతులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నెటిజన్లు కోర్టుపై అసహనం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగలేదని..బెయిల్ షరతులు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొంటూ జువైనల్ కోర్టుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బాలుడి తండ్రి అరెస్ట్ 

ఈ కేసులో టీనేజర్ తండ్రి అయిన విశాల్ అగర్వాల్‌‌ పుణెలో ప్రముఖ రియల్టర్. కొడుకు చేసిన యాక్సిడెంట్ గురించి తెలియగానే తనను అరెస్టు చేస్తారని ఊహించిన విశాల్ అగర్వాల్‌‌ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఓ కారులో ముంబై బయల్దేరి.. తనకు చెందిన మరో కారును డ్రైవర్ తో గోవాకు పంపించాడు. మధ్యలో స్నేహితుల నుంచి కార్లు తెప్పించుకుని అందులోకి మారాడు. ఫోన్ ట్రాక్ చేయకుండా కొత్త సిమ్ ఉపయోగించాడు. అయితే, స్నేహితుడి కారులో ఉన్న జీపీఎస్ ట్రాకర్​తో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ముందు విశాల్ అగర్వాల్‌‌పై ప్రజలు సిరా విసిరి నిరసన తెలిపారు.

ధనికుడి కొడుకైతే వదిలేస్తరా: రాహుల్ గాంధీ

మైనర్ నిందితుడికి బెయిల్ ఇచ్చే సందర్భంలో జువైనల్ కోర్టు విధించిన కండీషన్స్​పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంలో న్యాయం ధనంపై ఆధారపడి ఉన్నదని ఫైర్ అయ్యారు. "బస్సు, ట్రక్‌‌, ఓలా లేదా ఉబర్‌‌ డ్రైవర్‌‌ ఎవరైనా పొరపాటున ఎవరినైనా చంపితే వారికి పదేండ్ల జైలుశిక్ష విధిస్తారు. అదే..ఓ ధనిక కుటుంబానికి చెందిన బాలుడు మద్యం తాగి కారు నడిపి, ఇద్దరిని చంపితే వ్యాసం రాయమని చెబుతారా..? ఇది న్యాయమేనా..? న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి. కానీ దేశాన్ని మోదీ బిలియనీర్లు, పేదలు అనే రెండు రకాలుగా విభజించారు" అని రాహుల్ మండిపడ్డారు.