నాకొద్దీ చైర్మన్ పోస్ట్ .. ఆర్టీసీ చైర్మన్ గిరి పొడగింపునకు నో అంటున్న బాజిరెడ్డి గోవర్ధన్

నాకొద్దీ చైర్మన్ పోస్ట్ .. ఆర్టీసీ చైర్మన్ గిరి పొడగింపునకు నో అంటున్న బాజిరెడ్డి గోవర్ధన్

 

  • అయిదోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే కోరిక
  • టర్మ్ మొత్తం ఎండీతో విభేదాలు  
  • తన కంటే జూనియర్​ పువ్వాడ కింద పనిచేయడంపైనా కినుక  

హైదరాబాద్, వెలుగు:  “ ఆర్టీసీ చైర్మన్​గా ఎక్స్ టెన్షన్ నాకొద్దు. త్వరలో ఎన్నికలు ఉన్నయి. నియోజకవర్గం మొత్తం పర్యటించాల్సి ఉంది.  రెండేళ్ల టర్మ్ కష్టపడి పూర్తి చేసిన. చైర్మన్​గా నేను చెప్పిన పనులు అధికారులు చేయలేదు. దీని వెనుక ఎండీ ఆదేశాలున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నా కంటే చాలా జూనియర్ పువ్వాడ మంత్రిగా ఉన్నారు. ఆయన కింద పనిచేయలేను” ఇవి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్​గా టర్మ్ పూర్తయిన బాజిరెడ్డి గోవర్ధన్ తన సన్నిహితుల దగ్గర చేసిన వ్యాఖ్యలు. ఆర్టీసీ చైర్మన్​గా బాజిరెడ్డి ఈనెల 20న టర్మ్ పూర్తయింది.  పదవిని పొడిగించేందుకు కేసీఆర్ అంగీకరించినా త్వరలో ఎలక్షన్స్ ఉండటంతో బాజిరెడ్డి అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అయిదోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి నిజామాబా ద్ జిల్లాలో సీనియర్ నేతగా, బలమైన సామాజిక వర్గం(మున్నూరు కాపు) నేతగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన కొడుకుకు అవకాశం ఇవ్వాలని కోరినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినందున పార్టీ ఆయనవైపే మొగ్గుచూపింది.    

రాజీనామాకు సిద్ధపడి..  

రవాణా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రితో పోలిస్తే బాజిరెడ్డి చాలా సీనియర్. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు ఏజ్​లో చాలా పెద్ద. ఆర్టీసీ చైర్మన్​గా నియామకం అయిన తర్వాత జూనియర్ కింద పనిచేయాల్నా? అని తన సన్నిహితుల దగ్గర ఆయన చెప్పుకున్నట్లు సమాచారం.  ఒక దశలో చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. కేసీఆర్, కవిత నచ్చజెప్పటంతో వెనక్కి తగ్గి టర్మ్​ను పూర్తి చేసినట్లు చెప్తున్నారు. సీనియర్ నేతగా మంత్రి పదవి రేసులో బాజిరెడ్డి ఉన్నా.. సీఎంకు సన్నిహితుడైన ప్రశాంత్ రెడ్డిది అదే జిల్లా కావడంతో బాజిరెడ్డికి క్యాబినెట్​లో చోటు దక్కలేదు. వీరిద్దరి కంటే సీనియర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండగా ఆయనకు స్పీకర్​గా పదవి ఇవ్వడంతో ప్రశాంత్ రెడ్డికి లైన్ క్లియర్ అయి మంత్రి పదవి దక్కింది.

ఎండీతో విభేదాలు 

ఆర్టీసీ చైర్మన్​గా బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తో విభేదాలు ఉన్న ట్లు మొదటి నుంచి సంస్థలో చర్చ జరుగుతోంది. “చై ర్మన్​గా ఉన్నా ఆర్టీసీలో ఏ చిన్న పని కావటం లేదు. నేను పంపిన ప్రతిపాదనలను ఎండీ ఆమోదించటం లేదు. అధికారులు ఎండీ చెప్పినట్లే వింటున్నరు. జిల్లా స్థాయిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అధికారుల బదిలీలు కూడా చైర్మన్ హోదాలో ఉండి చేయించుకోలేకపోతున్న” అని తన సన్నిహితులతో బాజిరెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. ఓ ఉద్యోగి ట్రాన్స్ ఫర్ కోసం బాజిరెడ్డి సిఫారసు చేసి రీజనల్ మేనేజర్ దగ్గరకు పంపగా.. అతడిని మరింత దూరంగా ట్రాన్స్ ఫర్ చేశారని, ఎండీ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమని చెప్తున్నారు. కొత్త బస్సుల కొనుగోలు, అద్దె బస్సులు, కార్మికుల అంశాల్లోనూ తన మాటను ఎండీ లెక్కచేయడంలేదని ఆయన అసహనానికి గురయ్యారు. ఎండీగా ఏదైనా పొరపాటు జరిగితే తాను బద్నాం అవకూడదనే ఉద్దేశంతోనే, సంస్థ నిర్వహణలో ఇతరుల జోక్యం లేకుండా నేరుగా ప్రగతి భవన్ తోనే టచ్ లో ఉంటున్నారని అంటున్నారు. ఏదైనా సరే తాను చెబితేనే చేయాలని అధికారులకు ఎండీ సజ్జనార్ మొదటి నుంచే ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటున్నారు.