
- తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: సాంకేతికరంగంలో విద్యార్థులు ముందడుగు వేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. శనివారం లోక్ నాయక్ భారతరత్న జయప్రకాశ్ నారాయణ్ 123 వ జయంతిని మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో జరుపుకున్నారు. జయప్రకాశ్ నారాయణ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాలేజీలో రక్తదాన శిబిరం, ఆన్ లైన్ అసైస్మెంట్ కోసం కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేపీఎన్సీఈ కాలేజీ అంతర్జాతీయ పోటీ పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు.
నేటి ప్రపంచంలో పోటీతత్వం పెరిగిందని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంలో దేశం అభివృద్ధి చెందుతోందని, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తేవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం కాలేజీకి చెందిన ప్రొఫెసర్ సాయికృష్ణకు జయప్రకాశ్ నారాయణ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు. 85 మంది రక్తదానం చేశారు. కాలేజీ చైర్మన్ కేఎస్ రవికుమార్, సెక్రటరీ వెంకటరామరావు, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కోటల సందీప్ కుమార్, బాలయ్య, అజయ్ కుమార్ పాల్గొన్నారు.