
ఆయా సందర్భాలలో చాలామంది మేధావులు బాలగోపాల్ ఉంటే ఏమనేవాడో అని ఆలోచిస్తున్నారు అంటే బాలగోపాల్ అవసరత ఇంకా ఈ దశలో ఉన్నదనే వాస్తవాన్ని తెలుపుతున్నది. ఎంతో సంక్లిష్టమైనది, సున్నితమైనదని భావించిన ఎస్సీ వర్గీకరణను అందులో సహజ న్యాయసూత్రాన్ని సమర్థించడానికి చాలామంది మేధావులు తటపటాయించిన సందర్భంలో బాలగోపాల్ తనతోటి భావసారూప్య చింతనాపరులతో కలిసి దాన్ని సమర్థించడమే కాకుండా న్యాయస్థానంలో పోరాడారు. దాని ఫలితం ఇటీవల సుప్రీంకోర్టు బాలగోపాల్ వాదనను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
అటువంటి సమస్యనే మళ్ళీ ఇప్పుడు తెలుగు సమాజంలో ప్రత్యేకించి తెలంగాణలో ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్‌తో ఆదివాసులు, దాన్ని వ్యతిరేకిస్తూ లంబాడీలు ఉద్యమాలు చేస్తున్న సమయంలో ఉన్నాం. ఈ సందర్భంలో బాలగోపాల్ ఉండుంటే కచ్చితంగా దాని మీద పనిచేసి ఇరువురికి అంగీకారం అయ్యేలా సూత్రప్రాయమైన సమన్యాయ ప్రతిపాదనలతో ఇరుపక్షాలను సమన్వయం చేసేవారు అనేది ఆ సామాజిక వర్గాలు చేసుకుంటున్న చర్చ.
తగ్గిపోతున్న ప్రజాస్వామిక విలువలు
‘వ్యవస్థ పట్ల ప్రజలలో ఏ విశ్వాసం (దేశభక్తి)కలిగించనిదే ఏ వ్యవస్థా నిలవదు. విశ్వాసం కలిగించడానికి నిజమైన ఆదర్శాలు, నిజమైన సామాజిక న్యాయం, నిజమైన సార్వజనీన ప్రగతి కొరవడినపుడు మతతత్వాన్ని, జాతీయవాదాన్ని పాలకులు ఆశ్రయిస్తారు’ అని బాలగోపాల్ చెప్పినదే ఇప్పుడు జరుగుతున్నది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడి గద్దెనెక్కే నేతలు అధికారంలోకి చేరుకున్నాక దాని గురించి మాట్లాడటం కూడా తప్పుగా చూస్తూ వాటిని గురించి మాట్లాడినవారిని రకరకాల పేర్లతో శిక్షించాలని చూస్తున్నారు. నేతలే కాదు సామాన్య ప్రజానీకం కూడా అటువంటి ఆలోచనలతోనే మెజారిటీ సమాజం ఉన్నదిప్పుడు.
ప్రభుత్వాల నుంచి ప్రజల భూములను కోర్టులో కేసులు వేసి కాపాడిన బాలగోపాల్‌ను ఇప్పుడు ప్రజలు ప్రత్యేకంగా తలుచుకుంటున్నారు. ‘ప్రభుత్వ ఖజానాకు ప్రైవేట్ బ్యాంకు అకౌంట్లకూ పెట్టుబడులను వేగంగా జమచేసేది మాత్రమే అభివృద్ధి కాదని, ప్రజల జీవితాలను బాగుపరిచేదే అభివృద్ధి అని గ్రహించే రోజు ఎప్పుడొస్తుందో’ అని తండ్లాడిన బాలగోపాల్ ను సమాజం యాది చేసుకుంటున్నది.
నేటితరంపై బాలగోపాల్ ప్రభావం
ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్ అని మాట్లాడుతున్న ప్రభుత్వాల దమన నీతిని బాహాటంగా ఎండగట్టేవాడు. ఆర్థిక నేరగాళ్లంతా దేశం బయట జల్సాలు చేస్తుంటే వినోదం చూస్తున్న ప్రభుత్వాలు ప్రజల హక్కుల కోసం మాట్లాడినవారిని మాత్రం జైల్లో వేస్తున్నపుడు ప్రభుత్వాల ద్వంద్వనీతిని ప్రజలముందు నిలబెట్టేవాడు. హక్కుల సాధనకు, ఉన్న హక్కుల పరిరక్షణ, అమలుకోసం అలుపెరుగక శక్తినంతా ఉపయోగించి పోరాడేవాడు.
ఇట్లా సమాజంలోని ప్రతి క్లిష్టమైన సంధి దశలో తలెత్తే సందేహాలను నివృత్తి చేయడానికి, సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకడానికి అవసరమైన మేధోమథనాన్ని చేసిన బాలగోపాల్ తన రచనల ద్వారా, తన మాటల ద్వారా, తన చేతల ద్వారా ఇప్పటికీ ఈ తరాన్ని ప్రభావితం చేయగలుగుతున్నాడు. అతనుంటే ఏమనేవాడో అని ఆలోచించేలా చేస్తున్న ఆలోచన ఇంకా ఈ సమాజానికి అతని అవసరతను చూపిస్తుంది. బాలగోపాల్ తన పని విధానం, ఆలోచనలతో ప్రాంతీయ అంతరాలను చెరిపేస్తూ జాతీయ,అంతర్జాతీయ సమస్యల పట్ల కూడా స్పందించి విశ్వమానవ హక్కుల కోసం నిరంతరం తపించిన హక్కుల తత్వవేత్త.
బాలగోపాల్‌ను స్మరించుకోవడం అంటే అతని ఆలోచనలను, ఆశయాలను సాధించడానికి మరొక్కసారి మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే. ఈ సమాజంలో ప్రజాస్వామిక విలువలను కాపాడటానికి, దానికి బలం ఇవ్వడానికి కృషిచేయాల్సిన బాధ్యత బుద్ధిజీవులపైన మరింత ఎక్కువగా ఉన్నదని చెప్పిన బాలగోపాల్ మాటలను ఆచరణలో పెట్టడమే నిజంగా మనం ఆయనకు ఇచ్చే నివాళి.
(12 అక్టోబర్ 2025 ఆదివారం నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలగోపాల్
16వ సంస్మరణ సభ... అందరూ ఆహ్వానితులే )
- దిలీప్.వి,
మానవ హక్కుల వేదిక