ఏపీ నుంచి హైదరాబాద్​కు హ్యాష్​ ఆయిల్ .. రూ.12.30 లక్షల విలువైన సరుకు స్వాధీనం

ఏపీ నుంచి హైదరాబాద్​కు హ్యాష్​ ఆయిల్ .. రూ.12.30 లక్షల విలువైన సరుకు స్వాధీనం
  • సప్లై చేస్తున్న ముగ్గురు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: ఆంధ్రప్రదేశ్​ నుంచి హ్యాష్​ ఆయిల్​ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముగ్గురిని బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులు.. మేడ్చల్​ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. వివరాలను మేడ్చల్​ ఇన్​చార్జి డీసీపీ  శ్రీనివాస్​రావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఏపీలోని గోలుగుంటకి చెందిన గొల్లు కుమారస్వామి (21) బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చాడు. గండిమైసమ్మలోని ఓ ఫార్మా కంపెనీలో మెకానిక్​గా పనిచేస్తున్నాడు.

చెడు అలవాట్లకు బానిసై అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందు కోసం ఏపీ నుంచి హ్యాష్​ ఆయిల్​ను హైదరాబాద్​కి తెచ్చి స్టూడెంట్లు, కార్మికులకు విక్రయించడానికి ప్లాన్  చేశాడు. తునికి చెందిన హ్యాష్​ ఆయిల్​ సప్లయ్​ చేసే నాగేశ్వరావు అలియాస్​ నాగుని సంప్రదించాడు. అతడు హ్యాష్​ ఆయిల్​ సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడు.

దీంతో కుమారస్వామి తన మిత్రుడైన గోలుగుంటకి చెందిన కోడి అజయ్​ కుమార్​ (41) డ్రైవర్​ని సంప్రదించి నాగు నుంచి హ్యాష్​ ఆయిల్​ తీసుకుని తనకు అందజేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుమారస్వామి సూచనల ప్రకారం శుక్రవారం అజయ్​కుమార్..​ తన మిత్రుడైన స్వామి గణేష్​తో కలిసి తునికి బైక్​ పై వెళ్లి నాగు నుంచి హ్యాష్ ఆయిల్  తీసుకుని శనివారం రాత్రి హైదరాబాద్​కి వచ్చారు. కుమారస్వామిని కలిసి మేడ్చల్​ వైపు బయలుదేరుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12.30 లక్షల  విలువైన 2.2 లీటర్ల హ్యాష్​ ఆయిల్, 3 మొబైల్​ ఫోన్లు, బైక్​ను స్వాధీనం చేసుకున్నారు.    

హిమాచల్ ప్రదేశ్  నుంచి తెచ్చి సరఫరా

హిమాచల్​ప్రదేశ్​ నుంచి హ్యాష్ ​ఆయిల్​ తెచ్చి విద్యార్థులకు అమ్ముతున్న ఓ వ్యక్తిని బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని దుండిగల్  పోలీసులకు అప్పగించారు. దుండిగల్​ మల్లంపేటకు చెందిన కనగల ఉదయ్​కుమార్​ (29) డాగ్​ బ్రీడర్​గా పనిచేస్తున్నాడు. అక్రమ సంపాదనకు అలవాటుపడి హిమాచల్​ ప్రదేశ్​నుంచి హ్యాష్​ ఆయిల్​ తెచ్చి స్టూడెంట్లకు అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులు ఉదయ్  కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 94 గ్రాముల  హ్యాష్​ ఆయిల్, మొబైల్  ఫోన్, రూ.11 వేలు స్వాధీనం చేసుకున్నారు.