ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ 30 లక్షలు

ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ  30 లక్షలు
  • వేలంలో దక్కించుకున్న బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి
  • ప్రధాని నరేంద్ర మోదీకి లడ్డూ అందజేస్తానని ప్రకటన

ఎల్బీనగర్/గండిపేట, వెలుగు: బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. గతేడాది నిర్వహించిన వేలంలో రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకోగా.. ఈసారి 30 లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్ వాసి, బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి చేజిక్కించుకున్నాడు. నిరుడు వేలంలో 36 మంది పాల్గొనగా.. ఈ ఏడాది నలుగురే పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఊళ్లో ఊరేగింపు నిర్వహించారు. 10 గంటలకు వేలం నిర్వహించే బొడ్రాయి వద్దకు తీసుకొచ్చారు.

10.32 గంటలకు గణేశ్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం ప్రారంభించింది. చివరికి లడ్డూ ధర 30 లక్షల వెయ్యి రూపాయలకు ముగిసింది. 29లక్షల 97వేల రూపాయలకు దశరథ్ గౌడ్ పాట పాడగా.. వెంటనే 30 లక్షల వెయ్యి రూపాయలు అని కొలన్ శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నాడు. వేలం పాటకు సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. వేలం పాట ప్రోగ్రామ్​లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, మేయర్ చిగురింత పారిజాత, మాజీ జడ్పీ చైర్​పర్సన్ అనితరెడ్డి ఉన్నారు. 

1994లో మొదలైన వేలం 

బాలాపూర్ వినాయకుడికి 44 ఏండ్ల చరిత్ర ఉంది. లడ్డూ వేలం మాత్రం1994 నుంచి మొదలైంది. మొదటిసారి లడ్డూ‌‌‌‌ను బాలాపూర్​కు చెందిన కొలన్​మోహన్ రెడ్డి రూ.450కు దక్కించుకున్నాడు. నిరుడు తుర్కయంజాల్​కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి రూ.27లక్షలకు చేజిక్కించుకున్నాడు. కొలన్ శంకర్ రెడ్డి కుటుంబానికి చెందినవాళ్లే.. పది సార్లు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది వరకు లడ్డూను సొంతం చేసుకున్నవాళ్లు స్థానికులు అయితే డబ్బులను మరుసటి ఏడాది చెల్లించే వెసులుబాటు ఉండేది. కానీ.. ఈసారి నుంచి ఎవరెవరు వేలంలో పాల్గొంటున్నారో వారితో ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయించుకోవాలన్న కొత్త నిబంధన పెట్టారు. అందులో భాగంగా నలుగురి నుంచి రూ.30లక్షల చొప్పున డిపాజిట్ చేయించుకున్నారు. 

21 కిలో మీటర్లు.. 9 గంటలు.. 

బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం మంగళవారం ప్రశాంతంగా  ముగిసింది. మొత్తం 21 కిలో మీటర్ల మేర శోభాయాత్ర కొనసాగింది. 9 గంటల పాటు ప్రయాణించిన బాలాపూర్ వినాయకుడు.. సాయంత్రం 4.13 నిమిషాలకు ట్యాంక్​బండ్ పై ఉన్న 12వ నంబర్ క్రేన్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు. 7.30 నుంచి 10.30 దాకా ఊరంతా ఊరేగించారు. 10.35 గంటలకు లడ్డూ వేలం ప్రారంభించి 10.42 గంటలకు ముగించారు. 11.27 గంటలకు అక్కడి నుంచి మొదలైన శోభాయాత్ర.. హనుమాన్ టెంపుల్, గణేశ్ చౌక్, డైమండ్ హోటల్, మైసమ్మ కట్ట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్​గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్, హిమాయత్​నగర్ మీదుగా సెక్రటేరియెట్​కు చేరుకుంది. ట్యాంక్​బండ్​పై ఉన్న 12వ క్రేన్ వద్ద 4.13 నిమిషాలకు నిమజ్జనం పూర్తయింది. 

గతంలో నాలుగు సార్లు పోటీపడ్డా

గతంలో నాలుగు సార్లు లడ్డూ కోసం పోటీపడ్డా దక్కలేదు. ఇప్పుడు దేవుడి దయవల్ల లడ్డూను సొంతం చేసుకున్న. ఈ లడ్డూను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేస్తా. కరోనా టైంలో ప్రపంచాన్ని కాపాడిన మోదీ సల్లగుండాలి. అందుకే ఆయనకు ఇవ్వాలని అనుకుంటున్నా. మోదీ సల్లంగుంటేనే దేశం బాగుంటది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి లడ్డూను మోదీకి ఇస్తా.  కొలన్ శంకర్ రెడ్డి, లడ్డూ విజేత 

బండ్లగూడ జాగీర్​ లడ్డూకు 1.87 కోట్లు

రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంలో లడ్డూ రికార్డు ధర పలికింది. సోమవారం రాత్రి మండపం వద్ద వేలం పాట నిర్వహించగా.. రూ.కోటి 87 లక్షలకు దియా చారిటబుల్ ట్రస్ట్ లడ్డూను కైవసం చేసుకున్నది. నిరుడు కోటి 26 లక్షలు పలికింది. ఈసారి ఏకంగా రూ.59 లక్షలు పెరిగింది.

నాలుగు గ్రూపుల్లో 25 మంది చొప్పున విల్లాకు చెందిన వంద మంది వేలంలో పాల్గొన్నారు. ఇందులో ఒక గ్రూపు ఈ లడ్డూను కైవసం చేసుకున్నది. అయితే, లడ్డూను దక్కించుకున్న వారి పేరును మాత్రం నిర్వాహకులు బయటపెట్టలేదు. వేలం ద్వారా వచ్చిన డబ్బులను దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు ఖర్చు పెడ్తామని ఆర్గనైజర్లు వెల్లడించారు. వినాయకుడిని అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాండ్​లో నిమజ్జనం చేశారు.