
- గౌడ సమస్యలను మేనిఫెస్టోలో పెడితేనే మద్దతిస్తం
- రాష్ట్ర గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ
ముషీరాబాద్, వెలుగు : గౌడుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చిన పార్టీకే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలంగాణ గౌడ్ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కమిటీ కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్ తో కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టో సలహాదారుడు మల్లు రవిని కలిశారు. గౌడ కులస్తుల సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరచాలని పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు.
అనంతరం బాలరాజు గౌడ్ మాట్లాడుతూ..గౌడ్ ల సంక్షేమానికి5 వేల కోట్లతో గౌడ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైన్స్ బార్లలో 50 శాతం సబ్సిడీతో కల్లుగీత సొసైటీలకు ఇవ్వాలన్నారు. లిక్కర్ కంపెనీలను 50% గౌడ్ లకు ఇవ్వాలని, 50 ఏండ్లు పైబడిన గీత వృత్తిదారులకు రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. గీత వృత్తికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు, సూర్యపేట జిల్లాకు ధర్మ బిక్షం పేరు పెట్టాలని పేర్కొన్నారు.