బాలసముద్రం హాస్టల్ ఘటన దురదృష్టకరం : ఎమ్మెల్యే సీతక్క

బాలసముద్రం హాస్టల్ ఘటన దురదృష్టకరం : ఎమ్మెల్యే సీతక్క

బాలసముద్రం హాస్టల్ ఘటన దురదృష్టకరమని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పీఏ బంధువులే హాస్టల్ నడుపుతున్నారన్నారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు హాస్టళ్లపై నిఘా పెట్టాలన్న సీతక్క... అధికార బలంతో యువతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. బడికి పోయినా, గుడికి పోయినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  ప్రైవేట్ పీఏ శివ దళిత యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన దళిత యువతి హన్మకొండ బాలసముద్రం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఐదు సంవత్సరాల లా కోర్స్ చదువుతోంది. మూడు రోజుల క్రితం హాస్టల్ వార్డెన్  వేముల శోభ ఒక విషయమై మాట్లాడే పని ఉందంటూ.. యువతిని అలంకార్ ప్రాంతంలోని తన నివాసానికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో హనుమకొండ చౌరస్తాలో మెడికల్ షాప్ నిర్వహించే సదరు మహిళ బంధువు కోట విజయ్,  ఎమ్మెల్యే నరేందర్ పీఏ వేముల శివ ఆ ఇంటికి వచ్చారు. అక్కడే ఆ యువతిపై వారిద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 

విషయం తెలిసిన బాలిక బంధువులు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  ముగ్గురిపై పోలీసులు 506, 376, 109 సెక్షన్ల కింద అత్యాచార, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.  హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి నిందితుల వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా పోలీసు శాఖ గోప్యంగా ఉంచే ప్రయ‌త్నం చేసినా సాధ్యం ప‌డ‌లేదని ప్రచారం జరుగుతోంది.