Summer Tour : బాలి దేశం చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి 8 గంటలే.. ఆధ్యాత్మికం, ఆహ్లాదం

Summer Tour : బాలి దేశం చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి 8 గంటలే.. ఆధ్యాత్మికం, ఆహ్లాదం

ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే ప్రసిద్ధమైన దీవుల్లో బాలి ఒకటి. భారతీయ సంస్కృతితో అనుబంధం ఉన్న 'పురా'దేశం బాలి. కొండలపై సాగు చేసే రైతులు, నీటి ఆవాసాల మధ్య ప్రాచీన ఆలయాలు, సముద్ర గర్భంలోని పగడపు దిబ్బల చుట్టూ ఉండే జీవ వైవిధ్యం బాలి. మనకు తూర్పున ఉండే ఇండోనేషియాలోని బాలికి ఈ సమ్మర్లో ట్రిప్ వేయండి!

బాలి అనగానే అందమైన బీచుల్లో జలకాలాటలే గుర్తుకొస్తాయి. బాలి ద్వీపం అంటే సాగరతీరాలే కాదు. ఆ అందమైన తీరాలకు సమీపంలోనే మరో అద్భుతమైన సాంస్కృతిక జీవితం కనిపిస్తుంది. భిన్నమైన సాంస్కృతిక జీవనం, కళలు, అద్భుతమైన ప్రాచీన కట్టడాలు, ఆలయాలు, స్థానిక నృత్యాలు ఉంటాయి. కాలుమోపిన పర్యాటకుల్ని కట్టిపడేసే బాలి ద్వీపాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా ట్రిప్ అడ్వైజర్ ప్రశంసించింది.

సముద్రంలో జీవ వైవిధ్యం

బాలి సముద్రం మెరైన్ టూరిజానికి, ఆక్వా స్పోర్ట్స్ కు పేరుగాంచింది. వాటర్ స్పోర్ట్స్ జలకాలాటలలో తేలే పర్యాటకులు, సముద్ర గర్భంలోని జంతు ప్రపంచాన్ని వీక్షించే సాహస వీరులూ ఉంటారు. బాలికి సమీపంలోనే ఉండే పగడపు దీవులు ఇక్కడ చూడాల్సిన వాటిల్లో ముఖ్యమైనవి. సముద్ర జీవుల్లో ఎక్కువ జాతులు ఇక్కడే ఉంటాయి. సముద్రంలోని జీవ వైవిధ్యాన్ని వీక్షించడానికి ఇది అనుకూలం.

Also Read:-టూర్ వెళుతున్నారా.. మీ బ్యాగులు ఇలా సర్దుకోండి.. ఈ టిప్స్ తెలుసుకోండి..!


బాలిలో ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న నీటి తీరువా విధానం 'సుబాక్' ని యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వంగా ప్రకటించింది. కొండ ప్రాంతాలపై పండించే పంట పొలాలను చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అంత మనోహరంగా ఉంటాయి. కనుచూపు మేరకు ఉండే కొండలపై సన్నగా, పొడవుగా ఉండే మడులు చూడ ముచ్చటగా ఉంటాయి. కృత్రిమ పద్ధతుల్లో వర్షపు నీటిని సేద్యానికి ఉపయోగించేందుకు బాలీ ప్రజలు ప్రత్యేకమైన నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీనిని “సుబాక్” అని పిలుస్తారు. కొండలపై పడ్డ ఏ ఒక్క చినుకునీ వృథాగా జారి పోకుండా ఒడిసిపట్టి దానిని వరి మడుల్లోకి మళ్లించే విధానం చూస్తే ప్రాచీన కాలంలోనే ఎంత గొప్ప సాంకేతికత ఉందో అర్థమవుతుంది. అయిదు ఎత్తయిన కొండల మధ్య కాలువలు నిర్మించి ఒక కొండపై అదనంగా ఉన్న వాన నీటిని మరో కొండపైకి మళ్లించే చిన్న చిన్న నిర్మాణాలు ఈ సుబాక్ సాగు నీటి నిర్వహణలో చూడొచ్చు. 49 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న తొమ్మిదవ శతాబ్దం నాటి ఈ సాగునీటి విధానాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది.

పురా దేశం 

బాలీలో ఉండే హిందూ ఆలయాన్ని 'పురా' అంటారు. బాలీ ద్వీపంలో ఎన్నో పురాలున్నాయి. హిందువుల ఆగమ సంప్రదాయాన్ని అనుసరిస్తూ స్థానిక వాస్తు నిర్మాణంలో ఈ పురాలను ప్రాచీన కాలంలో నిర్మించారు. నదిని దేవతగా ఆరాధించే భారతీయ సంప్రదాయం ఇక్కడా ఉంది. ఎత్తయిన కొండల దిగువ భాగంలో ప్రాచీన కాలంలో నిర్మించిన ఆలయాలున్నాయి. శైవ, సాంఖ్య, వజ్రయాన బౌద్ధం, ఆస్ట్రోనేషియన్ ప్రభావం ఈ ఆలయాల్లో కనిపిస్తుంది. హిందూ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. ఈ వాటర్ టెంపుల్స్ మౌంట్ బతుర్పై ఉన్న క్రాటర్ చెరువులో నిర్మించిన 'పురా ఉలన్ దను 'బతుర్' ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయ వాస్తు నిర్మాణం, శిల్ప సౌందర్యం చాలా ప్రత్యేకమైనది. వెయ్యేళ్ల క్రితంనాటి 'హొబిస్ హొ' నిర్మాణ శైలికి మచ్చుతునక.

* హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ మీదుగా బాలీకి చేరుకోవడానికి విమాన సర్వీసులున్నాయి. 
* ఎనిమిది గంటల ప్రయాణం
 • ఒక ప్రయాణానికి టికెట్ ఖరీదు సుమారు 35,000 రూపాయలు 
* విమాన ప్రయాణానికి 8 నుంచి 11 గంటలు
* బాలీలో పర్యాటకుల ఆసక్తిని బట్టి బీచ్, టెంపుల్స్, ప్యాలెస్, అగ్రికల్చర్, మెరైన్, కల్చరల్ ప్రదేశాలను ఎంచుకునేలా ట్రావెల్ ప్యాకేజీలుంటాయి.

వాటర్ ప్యాలెస్

అలనాటి అంతఃపురం ఇది. ఈశాన్య బాలిలో గాన్ పట్టణానికి ఐదు కిలో మీటర్ల దూరంలోని అబాంగ్ లో ఇది ఉంది. ఈ వాటర్ ప్యాలెస్ పేరు ' తీర్థ గంగ'.

తీర్థ ఎంపల్ 

పవిత్ర స్నానాలకు ప్రసిద్ధమైన విష్ణు ఆలయం ఇది. వర్మదేవ చక్రవర్తి పాలనలో క్రీ.శ. 962లో దీనిని నిర్మించారు. ఎత్తయిన బహుళ అంతస్తుల శిఖరాలు స్నానవాటికల నిర్మాణంలో ఇదెంతో ప్రత్యేకమైనది.