- ఎన్నికలను డిస్టర్బ్ చేసేందుకు అల్లర్లు
- మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫ్రస్టేషన్‌కు గురవుతూ అలజడి సృష్టిస్తున్నారని మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం రామకృష్ణాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అవినీతికి తావులేకుండా పాలన అందిస్తున్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు వేసేందుకు వెళ్తున్న సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌పై రాళ్లు, ట్రాఫిక్ డివైడర్ కోన్‌లతో దాడి చేయడం దారుణమన్నారు.
బాల్క సుమన్‌తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలను అడ్డుకుంటున్నారంటూ ప్రజలను మభ్యపెడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బాల్క సుమన్ రాసలీలల బాగోతం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.
ఇప్పుడేమో మహిళలను అడ్డం పెట్టుకుని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శంచారు. గత పదేళ్లలో ఎమ్మెల్యే, ఎంపీగా ఉండి ఈ ప్రాంత యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చారని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, భూ, మట్టి దందాలతో వందల కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధుల మళ్లింపుపై కూడా స్పందించలేదన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో అలజడి సృష్టించి సానుభూతి పొందాలనే ప్రయత్నాలు తగవన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ అవినీతిరహిత పాలన అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు చేరేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, సీనియర్ నేత అబ్దుల్ అజీజ్, గోపతి బానేశ్, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.
