కాంగ్రెస్​లో ఎందుకు చేరావంటూ బాల్క సుమన్ అనుచరుల దాడి : బాలకృష్ణ

కాంగ్రెస్​లో ఎందుకు చేరావంటూ బాల్క సుమన్ అనుచరుల దాడి : బాలకృష్ణ
  • మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో ఘటన పోలీసులకు ఫిర్యాదు
  • బీఆర్ఎస్​లో చేరితే రూ.2 లక్షలు ఇస్తమన్నరు
  •  ఒప్పుకోనందుకే కొట్టిన్రు బాధితుడు ఉప్పు బాలకృష్ణ

కోల్ బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ లో కాంగ్రెస్ లో ఎందుకు చేరావంటూ సింగరేణి కార్మికుడిపై బీఆర్ఎస్ కౌన్సిలర్ బంధువులు శనివారం రాత్రి దాడి చేశారు. అబ్రహం నగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు ఉప్పు బాలకృష్ణ ఇటీవల కాంగ్రెస్​లో చేరారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు అన్న కొడుకులు వెంకటేశ్, రాకేశ్ శనివారం రాత్రి బాలకృష్ణపై దాడి చేశారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరావంటూ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కాంగ్రెస్ లీడర్లు బాలకృష్ణ దగ్గరకు వచ్చి  మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు  మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరవద్దంటూ వెంకటేశ్, రాకేశ్ బెదిరించారని, వారికి బాల్క సుమన్, కౌన్సిలర్ ఓదెలు, మున్సిపల్ చైర్మన్ జంగం కళ సహకరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరితే రూ. రూ.2 లక్షల ఇస్తామని ఒత్తిడి చేశారని, ఒప్పుకోకపోవడంతోనే కొట్టారని ఆవేదన చెందాడు.  

బాధితుడిని పరామర్శించిన గడ్డం వంశీకృష్ణ

బీఆర్ఎస్ లీడర్ల దాడిలో గాయపడిన బాలకృష్ణను కాంగ్రెస్ క్యాండిడేట్ వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ ఆదివారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ కాంగ్రెస్ లో చేరడం తట్టుకోలేకే బాల్క సుమన్ అనుచరులతో దాడి చేయించాడని ఆరోపించారు. బాల్క సుమన్ ది కార్యకర్తలను, ఓటర్లను లోబర్చుకునే సంస్కృతి అని విమర్శించారు. చెన్నూరులో సుమన్ పని ఖతమైందన్నారు. సుమన్ కు ప్రగతి భవన్​లోకి ఎంట్రీయే ఇవ్వడం లేదన్నారు. ఇష్టం వచ్చిన పార్టీలో చేరే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని, బాల్క సుమన్, ఆయన అనుచరులు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్  అజీజ్, పల్లె రాజు రఘునాథరెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య సత్యపాల్, శివకిరణ్ ఉన్నారు.

ఓటమి భయంతోనే దాడులు

బాల్క సుమన్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నాడని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు సరికాదన్నారు. తమ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బాల్క సుమన్ రోడ్ల మీద తిరగలేరని హెచ్చరించారు. బాల్క సుమన్ ను, ఆయన ప్రచార వాహనాలను ఇప్పటికే ప్రజలు అడ్డుకుంటున్నారని, ఎక్కడికక్కడ తరిమికొడుతున్నారని, డిసెంబర్ 3 తో చెన్నూరుకు పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు.